సోషల్ మీడియా పుణ్యమా అంటూ.. ప్రస్తుతం అన్నీ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీపావళి రోజున బాణాసంచా కాల్చడంపై సుప్రీం కోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. కానీ గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనస్ వివాహ వేడుకలో భాగంగా... రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, ఉమైద్ భవన్ ప్యాలెస్‌పై బాణసంచా కాల్చడం వివాదాస్పదమైంది.
సుప్రీం కోర్టు షరతులు విధిస్తుంటే.. ప్రియాంక, నిక్‌లు మాత్రం తమకు నచ్చినట్లు బాణాసంచా కాలుస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రియాంక ఆస్తమా వ్యాధిపై అవగాహన కలిగించే కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తూ ఇలాంటి పనికి ప్రోత్సహించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
కాగా, ఉమైద్ ఖాన్ ప్యాలెస్‌లో నిక్, ప్రియాంకల వివాహం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుకకు కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రిలయన్స్ దిగ్గజం అంబానీ కుటుంబం కూడా హాజరైంది. కానీ ప్యాలెస్‌పై వీరి వివాహం సందర్భంగా బాణాసంచా కాల్చడం ప్రస్తుతం వివాదానికి దారితీసింది. మరి ఈ వివాదంపై ప్రియాంక చోప్రా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.