చంద్రబాబు పాఠాలు విని.. పవన్ కొత్త రాగాలు.. ఆర్కే రోజా ఫైర్

ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (15:17 IST)
చిత్తూరు : టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చం‍ద్రబాబునాయుడు పెయిడ్‌ ఆర్టిస్టులతో ఆడిన డ్రామాలు బట్టబయలు కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబుకు అనుకూలంగానే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడని అన్నారు. 
 
ఆదివారం రోజా మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లపాటు చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై పవన్‌ కళ్లుమూసుకున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వంద రోజుల్లో జరిగిన అభివృద్ధి కనపడటం లేదా అని ప్రశ్నించారు. 100రోజుల్లోనే 80 శాతం హామీలు అమలయ్యాయని తెలిపారు.
 
గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో వైఎస్‌ జగన్‌ను గెలిపించారని, అది తిరగబడినా 151 అవుతుందని అన్నారు. ఒక సీటు మాత్రమే గెలుచుకున్న పవన్‌ ఆ విషయంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

సీఎం జగన్‌ 100 రోజుల పరిపాలనపై దేశమంతా మెచ్చుకుంటే.. చంద్రబాబు పాఠాలు విని కొత్త రాగాలు ఎత్తుకున్న పవన్‌కు ముఖ్యమంత్రి పరిపాలనపై మాట్లాడే హక్కు లేదన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు