శుభవార్త చెప్పిన రష్యా : ఆగస్టు 12న కోవిడ్ వ్యాక్సిన్

ఆదివారం, 9 ఆగస్టు 2020 (18:06 IST)
కొన్ని నెలలుగా ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోంది. ఈ వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం అవస్తవ్యస్తమైంది. అనేక రంగాలు కుదేలైపోయాయి. దీనికి ప్రధాన కారణం ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసే సరై వ్యాక్సిన్ లేదా చికిత్సా విధానం లేకపోవడమే. ఈ క్రమంలో కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు వీలుగా అనేక ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైవున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ప్రపంచానికి ఓ శుభవార్త చెప్పింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్ ను మొట్టమొదటిసారిగా ఈ నెల 12న ప్రపంచానికి పరిచయం చేయనున్నామని రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది.  
 
ఈ వ్యాక్సిన్‌ను గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. గత వారం రక్షణ శాఖ ప్రతినిధి గ్రిడ్నేవ్ మీడియాతో మాట్లాడుతూ, మెడికల్ సిబ్బందికి, వయో వృద్ధులకు తొలిసారి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. వ్యాక్సిన్ సురక్షితను, పనితీరును 1,600 మందిపై పరిశీలించామన్నారు. గడచిన ఏప్రిల్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ సమయాన్ని కుదించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారులను ఆదేశించగా, వైద్య నిపుణులు మూడు దశల పరీక్షలను శరవేగంగా పూర్తి చేశారు.
 
ఈ క్రమంలో జూన్ 17వ తేదీన 76 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలను నిర్వహించారు. వీరిలో సగం మందికి ఇంజక్షన్ రూపంలో, మిగతావారికి పౌడర్ రూపంలో వ్యాక్సిన్‌ను అందించారు. రెండు రకాల పరీక్షల్లోనూ వ్యాక్సిన్ తీసుకున్న వారిపై సత్ఫలితాలను ఇచ్చిందని, అందరిలోనూ వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని రష్యా మీడియా వెల్లడించింది. పైగా ఏ ఒక్కరిలోనూ సైడ్ ఎఫెక్ట్స్‌ ఉత్పన్నంకాలేదని పేర్కొంది. 
 
మరోవైపు, వ్యాక్సిన్ తయారు చేసినట్టు రష్యా చేసిన ప్రకటనపై అమెరికా స్పందించింది. ఈ వ్యాక్సిన్‌ను అన్ని రకాలుగా పరీక్షించి, ఫలితాలను నిర్దారించుకున్న తర్వాతనే రష్యా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నామని యూఎస్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ ఆంటోనీ ఫౌసీ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ తయారైందని క్లయిమ్ చేసుకుని, దాన్ని పంపిణీ చేసే ముందు ఎటువంటి సమస్యలూ రాకుండా చూసేందుకు మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు