రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది సైనికులు, పౌరులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపధ్యంలో యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఫాక్స్ న్యూస్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇది ప్రత్యక్ష ప్రసారం అవడంతో ఈ ఇంటర్వ్యూ ఇపుడు వైరల్ అయ్యింది.
గ్రాహం తను చేసిన వ్యాఖ్యల గురించి చెప్తూ... హత్య చేయమంటూ చెప్పడం చాలా సులభం, చేయడం కష్టం. రష్యన్లకు నా సలహా ఏంటంటే... మీరు మీ జీవితాంతం చీకటిలో జీవించాలనుకుంటే, దుర్భరమైన పేదరికంలో మగ్గిపోతూ మిగిలిన ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఒంటరిగా ఉండాలంటే పుతిన్‌ను అలాగే సమర్థిస్తూ వుండండి. లేదంటే అతడిని తొలగించండి అంటూ ట్విట్టర్‌లో రాశారు.
మరోవైపు ఉక్రెయిన్ లోని న్యూక్లియర్ ప్లాంట్ పైన రష్యా దళాలు దాడి చేయడంతో అక్కడ భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఈ రియాక్టర్ కనుక విస్ఫోటనం చెందితే యూరప్ దేశాలు సర్వనాశనం అవుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేసారు. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా రష్యాను నిలువరించాలంటూ ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు.