ఉక్రెయిన్‌లో బయోలాజికల్ కేంద్రాలకు యూఎస్ మిలియన్ డాలర్ల నిధులు ఎందుకు? బయో వెపన్స్ చేస్తున్నారంటున్న రష్యా
బుధవారం, 9 మార్చి 2022 (21:56 IST)
సైనిక చర్య, వాయుసేన, నౌకాదళం... అణు బాంబు... ఇలా ఏది ఒక దేశం నుంచి మరో దేశానికి కదిలినా ఫలానా దేశం నుంచి దాడి ప్రారంభమైందని చెప్పవచ్చు. కానీ కరోనా దాడి ఏ దేశం నుంచి ప్రారంభమైందో ఇప్పటి వరకూ తెలియదు. ఎందుకంటే అది బయో వెపన్ లాంటిదన్న ఆరోపణలున్నాయి. ఆ బయో వెపన్ దాడికి దేశాలకి దేశాలే తుడిచిపెట్టుకుపోవచ్చు.
టార్గెట్ చేసిన దేశాన్ని సర్వనాశనం చేయవచ్చు. అదికూడా శత్రు దేశమే చేసిందా అనే ఆనవాళ్లు కూడా తెలియకుండా. అలాంటి బయో వెపన్ కరోనా రూపంలో గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పీడిస్తోందని ఇప్పటికే పలు దేశాలు చెపుతున్నాయి. ఇంకా రకరకాల వేరియంట్లలో వెర్రితలలు వేస్తోంది. ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో అంతుబట్టని విషయంగా మారింది.
ఇక అసలు విషయానికి వస్తే... ఉక్రెయిన్ పైన రష్యా గత ఫిబ్రవరి 24 నుంచి భీకర దాడులు చేస్తోంది. ఆ దేశంలోని ప్రధాన నగరాలపై విరుచుకుపడుతోంది. ఐతే మంగళవారం నాడు రష్యా చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. అదేంటంటే... ఉక్రెయిన్ దేశంలో కనీసం 30కి పైగా బయోలజికల్ కేంద్రాలున్నాయనీ, అక్కడ ఏం జరుగుతుందో తెలియాల్సి వుందని ప్రకటించింది.
ఉక్రెయిన్ దేశంలో జీవశాస్త్ర పరిశోధనా సామగ్రిని స్వాధీనం చేసుకోకుండా రష్యా దళాలను ఆక్రమించకుండా నిరోధించడానికి యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్‌తో కలిసి పనిచేస్తోందని రష్యా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌లోని బయోలాజికల్ రీసెర్చ్ సదుపాయాలపై నియంత్రణ సాధించేందుకు రష్యా దళాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. రష్యా ఆరోపణలను యూఎస్ సెనేటర్ మార్కో రూబియో తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ దేశం పైన జీవ లేదా రసాయన ఆయుధ దాడి జరిగితే, దాని వెనుక రష్యన్లు ఉంటారని అనుకోవాలా... అందుకే రష్యా ఇలాంటి ప్రకటన చేసిందా అంటూ మండిపడ్డారు.
ఇటీవల, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్‌లో యుఎస్ నిధులతో బయోలాబ్‌ల సాక్ష్యాలను కనుగొన్నట్లు పేర్కొంది. ఇది 'మిలిటరీ ఆపరేషన్' ప్రారంభమైనప్పుడు ప్రాణాంతక వ్యాధికారక నమూనాలను కనుగొన్నామనీ, వాటిని సత్వరమే నాశనం చేసినట్లు తెలిపింది.
ప్లూటోనియం ఆధారిత డర్టీ బాంబ్ న్యూక్లియర్ వెపన్‌ను తయారు చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోందని రష్యా పేర్కొంది. మార్చి 6న మాస్కో విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో పేర్కొంటూ... యూఎస్ పెంటగాన్ ఆర్థిక సహాయంతో ఉక్రెయిన్‌లో మిలిటరీ-బయోలాజికల్ ప్రోగ్రాంను నడుపుతున్నట్లు తమ వద్ద ఆధారాలు వున్నాయంటూ తెలిపింది.
కాగా రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుండి వలసవెళ్లిపోయిన వారి సంఖ్య 20 లక్షలకు చేరుకుందనీ, ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ ఖండంలో అత్యంత వేగవంతమైన వలస అంటూ ఐక్యరాజ్య సమితి పేర్కొంది.