పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులకు మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చిన సీఐ గోరంట్ల మాధవ్‌కు అనంతపురం ఎంజీ జేసీ దివాకర్ రెడ్డి ప్రతిసవాల్ విసిరారు. ఈ నెల 25వ తేదీ వరకు అనంతపురం జిల్లాలోనే ఉంటానని, కత్తి పదును పెట్టుకొని నాలుక కోయడానికి సిద్ధంగా ఉండాలని జేసీ సూచించారు.
నాలుక కోస్తానంటూ హెచ్చరించిన ఏపీ పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, సీఐ మాధవ్ వ్యాఖ్యలపై జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం స్పందించారు. ఇదేమైనా సాయికుమార్ సినిమానా? మీసాలు తిప్పడానికి. రియల్ లైఫ్ వేరు, రీల్ లైఫ్ వేరన్నారు. నన్నే హెచ్చరించే అంత మగాడివా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ ఇంటికి రావాలా? మీ పోలీస్ స్టేషన్‌కు రావాలా? అనంతపూర్ క్లాక్ టవర్ వద్దకు రావాలా? లేదా మీ ఊరికి రావాలా? చెప్పు? అంటూ సవాల్ విసిరారు.
అంతేకాకుండా, 'నాలుకే కోయాలనుకుంటే వచ్చి కోసేయ్... నీ కత్తి ఎంత పదునుగా ఉందో చూస్తా' అంటూ జేసీ దివాకర్ రెడ్డి సవాల్ విసిరారు. 'నువ్వు ఖాకీ బట్టలు వదిలేసి రా... నేను కూడా ఈ బట్టలు వదిలేసి మామూలు బట్టలతో వస్తా... నీ సంగతేందో చూస్తా' అంటూ హెచ్చరించారు. నీది నిజమైన మీసమే అయితే ఎప్పుడొస్తావో చెప్పు అంటూ సవాల్ విసిరారు. 25వ తేదీ వరకు తాను ఇక్కడే ఉంటానని... ఏం చేస్తావో చేసుకో అంటూ ఛాలెంజ్ చేశారు. ఈలోగా కత్తికి బాగా పదును పెట్టుకో అన్నారు.