మమ్మల్ని తిట్టడమే విపక్షాలకు పనైపోయింది.. కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు : కేటీఆర్

బుధవారం, 2 మే 2018 (10:19 IST)
మా కుటుంబాన్ని నిత్యం తిట్టడమే ప్రతిపక్ష పార్టీలకు ఓ పనైపోయిందనీ అయినప్పటికీ.. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రగతి భవన్‌ పాటకీలు తెరుచుకోవడం లేదని, వాటిని బద్దలు కొడతామన్నారు.
 
సీఎం కేసీఆర్‌ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రగతి భవన్‌ పాటకీలు బద్దలు కొట్టడం కాదు. కేసీఆర్‌ వెంట్రుక కూడా పీకలేరు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ను, తమ కుటుంబ సభ్యులను తిట్టడమే ప్రతిపక్షాలకు పని అయిపోయిందని, చివరికి తమ కుటుంబంలోని  చిన్న పిల్లలను కూడా తిడుతున్నారని వాపోయారు. ఎవరు ఎన్ని తిట్టినా ప్రజలు అండదండలు పుష్కలంగా ఉన్నంత వరకు అవన్నీ తమకు దీవెనలే అవుతాయన్నారు. 
 
అలాగే, సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి. తెలంగాణకు తొలి సీఎం అయిన తర్వాత కార్మికుల కోసం ఎంతో చేస్తున్నారు. సమ్మెలు, ఆందోళనలు చేపట్టకుండా.. కనీసం వినతి పత్రాలు కూడా ఇవ్వకుండానే సమస్యలను పరిష్కరిస్తున్నారు. అంతమాత్రాన కార్మికులకు సమస్యలు లేవని నేను అనడం లేదు. కాస్త ఆలస్యమైనా ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. గత పాలకుల హయాంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించారు. కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మరీ జీతాలు పెంచారని కేసీఆర్ గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు