జాతీయ స్థాయిలో వైద్య కోర్సుల్లో (యూజీ) ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షా ఫలితాలను బుధవారం రాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేసింది. ఈ ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. టాప్-50లో ఎనిమిది మంది విద్యార్థులు నిలిచారు. వీరిలో తెలంగాణాకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థ రావు జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకును సాధించాడు. మొత్తం 720 మార్కులకుగాను 711 మార్కులు సాధించాడు.
అలాగే, 710 మార్కులతో ఏపీకి చెందిన మట్టా దుర్గా సాయి కీర్తి తేజ 12వ ర్యాంకు, 706 మార్కులతో నూని వెంకట సాయి వైష్ణవి 15వ ర్యాంకు, 705 మార్కులతో గల్లా హర్షవర్థన్ నాయుడు 25వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. బాలికల్లో నూని వెంకట సాయి వైష్ణవి 6వ ర్యాంకు, చప్పిడి లక్ష్మి చరిత్ర 14, వరుం అతిథి 20వ ర్యాంకును సాధించారు.
ఈ పరీక్షలకు జాతీయ స్థాయిలో మొత్తం 17,64,571 మంది హాజరయ్యారు. వీరిలో 9,93,069 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఉత్తీర్ణతా సాతం 56.27 శాతంగా ఉండగా, గత యేడాది 56.34 శాతంగా ఉంది. మొత్తం ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో ఓసీలు 45.03 శాతం, ఎస్సీలు 13.26 శాతం, ఎస్టీలు 4.76 శాతం, జనరల్ కేటగిరీ కింద 28.41 శాతం, ఈడబ్ల్యూఎస్‌లు 8.46 శాతం చొప్పున ఉన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఏపీ నుంచి 68,061 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 65,305 మంది పరీక్ష రాశారు. వీరిలో 40,344 మంది అంటే 61.77 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇక తెలంగాణ నుంచి 61,207 మంది దరఖాస్తు చేసుకోగా 59,296 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 35,148 మంది అంటే 59.27 శాతం మంది అర్హత సాధించారు. జాతీయ సగటుతో పోలిస్తే రెండు తెలుుగ రాష్ట్రాల్లోనూ ఎక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన తనిష్క 715 మార్కులతో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును, ఢిల్లీకి చెందిన అశిష్ బాత్రా రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.