ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా కరప మండలం వేళంగి గ్రామంలో గురువారం ఓ భిక్షగాడు హఠాత్తుగా మరణించాడు. రేకుల షెడ్డులో ఉంటూ వచ్చిన ఆ బిచ్చగాడు చనిపోయిన విషయాన్ని పోలీసులకు, స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడకు వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ భిక్షగాడి గదిని పరిశీలించారు. ఇందులో వేలాది రూపాయల కరెన్సీ నోట్లను, చిల్లర ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అతడు గురువారం గుండెపోటుతో చనిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. ఈ విషయమై కరప ఎస్‌ఐ డి.రమేశ్‌బాబును మాట్లాడుతూ అతడి వద్ద లభించిన నగదులో పది రూపాయల నోట్లే ఎక్కువగా ఉన్నాయని, చీకటి పడడంతో వాటిని లెక్కించడం సాధ్యపడలేదన్నారు.
నోట్లు, చిల్లరను సంచుల్లో పెట్టి సీలు వేసి స్టేషన్‌కు తరలించామని, శుక్రవారం లెక్కిస్తామని చెప్పారు. పంచాయతీ కార్మికులతో సహాయంతో మృతదేహాన్ని ఖననం చేసినట్టు తెలిపారు. కాగా, అతడి వద్ద లభించిన నగదు రూ.2లక్షలకు పైనే ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.