దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడు, ఆజన్మబ్రహ్మచారి.. అనవరతం రాజకీయాల్లో మునిగితేలిన వాజ్‌పేయీకీ యుక్త వయస్సులో ఒక ప్రేమ కథ ఉంది. కానీ, అది విఫల ప్రేమ. తాను ఇష్టపడిన ప్రియురాలు దక్కకపోయినా ప్రేమ కలకాలం నిలుస్తుందని నిరూపించిన వ్యక్తి అటల్ జీ.
ప్రేమలో ఓడిపోవడం ఉండదని బలంగా నమ్మిన వ్యక్తి. ఒకసారి ఒక పడతిని ఇష్టపడితే జీవితాంతం ఆమే మనసులో ఉండాలని తన జీవితాన్నే ఒక పాఠంగా మలచి చెప్పారాయన. పైగా, ఆమె కుటుంబాన్నే తన కుటుంబంగా మల్చుకున్నారు. కానీ ఎన్నడూ తన ప్రేమ విషయాన్ని ఆయనగానీ, ఆయన ప్రేమించిన వ్యక్తిగానీ బయటకు చెప్పలేదు. వారి ఇష్టాన్ని గుండెల్లోనే దాచుకున్నారు. అటల్ జీ - రాజ్‌కమారిల ప్రేమ కథ ఇదే.
అది 1942 సంవత్సరం. గ్వాలియర్ విక్టోరియా కళాశాలలో చదివే రోజుల్లో అటల్‌కు ఓ అమ్మాయి పరిచయమైంది. ఆ అమ్మాయి పేరు రాజ్‌కుమారి. ఇద్దరిదీ ఒకే తరగతి. ఇద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం. వీరిద్దరూ కాలేజీ లైబ్రరీలోనే కలుసుకునేవారు. కానీ మాట్లాడుకునేవారు కాదు. దూరం దూరంగానే కూర్చునేవారు. కళ్లతోనే మాట్లాడుకునేవారు.
ఆ రాజ్‌కుమారిని జీవిత భాగస్వామిగా చేసుకుందామనుకున్న వాజ్‌పేయీ ఓ ప్రేమలేఖను పుస్తకంలో పెట్టి దాన్ని ఆమెకు అందజేశారు. తర్వాత రెండు మూడు రోజులపాటు ఆమె నుంచి ఏ స్పందనా లేకపోవడంతో తన లేఖను ఆమె చూడలేదని ఆయన అనుకున్నారు.
కానీ రాజ్‌కుమారి దాన్ని చూసి సమాధానం కూడా లేఖ రూపంలో రాసి అదే పుస్తకంలో పెట్టారు, కానీ ఆమెకు వాజ్‌పేయిని కలిసి ఇచ్చే వీలు చిక్కలేదు. ఆ సమయంలో వ్యక్తిగత కారణాలతో వాజ్‌పేయి ఢిల్లీ వెళ్లారు. దాంతో ఆమె లేఖ వాజ్‌పేయీని చేరనేలేదు. ఆయనపై తన ఇష్టాన్ని రాజ్‌కుమారి తన తలిదండ్రులకు చెప్పినా వారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత బ్రజ్ నారాయణ్ కౌల్ అనే కాలేజీ లెక్చరర్‌కిచ్చి పెళ్లి చేసేశారు.
అలా తన ప్రేమ విఫలంకావడంతో వాజ్‌పేయి పెళ్లి చేసుకోకుండా పూర్తిగా రాజకీయాలకు అంకితమైపోయారు. అయితే, కొన్నాళ్ల తర్వాత వాజ్‌పేయీ ఢిల్లీలో రాజ్‌కుమారి కౌల్‌ని కలిశారు. ఆమె భర్త ఢిల్లీ వర్సిటీ పరిధిలోని రామజా కాలేజీలో అధ్యాపకుడుగా ఉద్యోగం చేస్తుండేవారు. అక్కడ భార్యాభర్తలిద్దరినీ వాజ్‌పేయి కలిసేవారు. బ్రజ్ నారాయణ్ కౌల్‌తో స్నేహం ఏర్పడటంతో వారింటికి తరచూ వెళ్తుండేవారు.
ప్రొఫెసర్ కౌల్ - రాజ్‌కుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు.. నమిత, నమ్రత. కొన్నాళ్లకు ప్రొఫెసర్ కౌల్ చనిపోయారు. ఆ తర్వాత వాజ్‌పేయితోనే రాజ్‌కుమారి ఉండిపోయారు. ఆయన అధికార నివాసానికే వచ్చారు. ఆమె కుమార్తె నమితను వాజ్‌పేయి దత్తత తీసుకున్నారు. నమిత, ఆమె కుమార్తె నీహారిక (నేహ) అంటే వాజ్‌పేయికి ప్రాణం.
ఇక.. వాజ్‌పేయితో దశాబ్దాలపాటు స్నేహ బంధం ఉన్నప్పటికీ రాజ్‌కుమారి ఎన్నడూ ఆయనతో బయట కనిపించలేదు. ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. 2014 సార్వత్రిక ఎన్నికలప్పుడు రాజ్‌కుమారి (84) కన్నుమూశారు. అలా తన మాజీ ప్రియురాలికి అటల్ జీ సేవ కూడా చేసి తన ప్రేమకు గుండెల్లోనే గుడికట్టుకున్నారు.