ఈ ఐదుగురు అక్కాచెల్లెళ్లూ కలెక్టర్లే

శుక్రవారం, 16 జులై 2021 (15:30 IST)
మ‌న ఇంట్లో అబ్బాయో... అమ్మాయో బాగా చ‌దివి... క‌లెక్ట‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటాం. అలాగే జ‌రిగితే అమితోత్సాహంతో పండ‌గ చేసుకుంటాం. మ‌న వీధి వీధంతా హంగామా చేస్తాం. అయితే, ఈ ఇంట్లో
అక్కా చెల్లెళ్ళు అంద‌రూ క‌లెక్ట‌ర్లే... ఒక‌రు కాదు... ఇద్ద‌రు కాదు... మొత్తం అయిదుగురు అక్కాచెల్లెల్లూ క‌లెక్ట‌ర్లే కావ‌డం ఓ రికార్డ్.
 
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆ సాదాసీదా మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం సహదేవ్‌ సహరన్‌ది. ఆయనేదో పెద్ద ఆఫీస‌రో... లేక అత్యంత ధ‌న‌వంతుడో అనుకునేరు... ఆయ‌నో చిన్న రైతు. ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు. 1) రోమా, 2) మంజు, 3) అన్షు, 4) రీతు, 5) సుమన్‌. త‌న‌కు కొడుకులు లేరని ఏనాడు కుంగిపోలేదు సహదేవ్‌. కానీ, ఆయ‌న‌కి కలెక్టర్‌ కావాలనే కోరిక ఉండేది. ఆ విషయాన్ని తన కుమార్తెలకు చెప్పారు.
 
తన కోరిక నెరవేర్చాలంటూ, తన మనసులోని మాట బయటపెట్టారు. దీంతో తండ్రిని అర్థం చేసుకున్న తనయలు ఎంతో కష్టపడి చదివారు. ఐదుగురు ఆడపిల్లలు ఉన్నత చదువులు చదవడమే కాకుండా, కలెక్టర్లుగా ఎంపికయ్యి తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చారు. సాధార‌ణ యువతకు ఆదర్శ ప్రాయంగా నిలిచారు. ఈ అరుదైన కుటుంబం రాజస్తాన్‌లోని హనుమాఘర్‌‌లో నివశిస్తోంది.
 
2018లో నిర్వహించిన రాజస్తాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పరీక్ష ఫలితాలు తాజాగా ప్రకటించగా, అన్షు, రీతు, సుమన్‌లు రాజస్తాన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌ (ఆర్‌ఎఎస్‌)కు ఏకకాలంలో ఎంపికై, అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పటికే ఆ ఇంట్లో రోమా, మంజులు కలెక్టర్లుగా పని చేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్‌ఎఎస్‌కు ఎంపిక కావడంతో, ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లు అయిపోయారు.
 
ఆర్‌ఎఎస్‌కు ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫోటోలను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి పర్వీన్‌ కష్వాన్‌ షేర్‌ చేయడంతో అందరికీ ఈ విషయం తెలిసింది. వారిని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. అవును మ‌రి... బిడ్డ‌లంతా క‌లెక్ట‌ర్లు అయిపోతే, ఏ త‌ల్లితండ్రుల‌కు అమితోత్సాహం క‌ల‌గ‌దూ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు