జైపూర్‌లో ఈ స్టేడియం నిర్మించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆర్‌సీఏకు రూ.100 కోట్ల సాయం అందించనుంది. అహ్మదాబాద్‌లోని మొతేరా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ తర్వాత అతిపెద్ద స్టేడియంగా ఇది నిలవనుంది. స్టేడియం నిర్మాణానికి ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని ఆర్‌సీఏ లీజుకు తీసుకుంది. నిర్మాణ వ్యయం రూ.350 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
జైపూర్ శివారులో చోప్ గ్రామంలో ఈ మైదానాన్ని ఏర్పాటు చేయనున్నారు. రూ.100 కోట్లను బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకోనున్న ఆర్‌సీఏ.. కార్పొరేట్ బాక్స్‌ల విక్రయం ద్వారానూ నిధులను సమీకరించనుంది. అత్యాధునిక సౌకర్యాలతో.. ప్రపంచస్థాయి వసతులు, అధునాతన సౌకర్యాలతో కొత్త స్టేడియం రూపుదిద్దుకోనుంది.
ఇండోర్ గేమ్స్, శిక్షణ అకాడమీలు, క్లబ్ హౌస్, భారీ పార్కింగ్ స్థలం, రెండు ప్రాక్టీస్ గ్రౌండ్లు నిర్మించనున్నారు. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరులో నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖర్చుతో, అత్యాధునిక సౌకర్యాలతో మొతేరా మైదానాన్ని నిర్మించారు. ఈ గ్రౌండ్ సీటింగ్ కెపాసిటీ లక్షా 10 వేలు. 1,00,024 సామర్థ్యంతో ఇప్పటిదాకా అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా ఉన్న ఎంసీజీ రికార్డును బద్దలు కొట్టిన మొతేరా మైదానం కోసం ఏకంగా రూ.800 కోట్లు ఖర్చు పెట్టారు.