తుపాకీ.కామ్ ఓ సర్వే నిర్వహించింది. 2023 ఎన్నికల్లో కేసీఆర్‌ను ఢీకొట్టే నేత ఎవరు అని పోల్ నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి.
-కేసీఆర్‌ను ఢీకొట్టే నేతగా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డినే భావిస్తున్నట్టు వెల్లడైంది. ఆయనే కేసీఆర్‌కు సరైన ప్రత్యర్థి అని ఏకంగా 66.15శాతం మంది అభిప్రాయపడడం విశేషం. దీన్నిబట్టి కాంగ్రెస్ పార్టీనే జనం ప్రత్యామ్నాయంగా రేవంత్ వచ్చాక భావిస్తున్నట్టు తెలుస్తోంది.
-తెలంగాణలో దూకుడుగా రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్‌ను ప్రజలు కేసీఆర్ ప్రత్యర్థిగా భావించడం లేదు. ఆయనకు కేవలం 15.96 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. కేసీఆర్‌కు సరితూగ గల నేత బండి సంజయ్ కాదని ప్రజలు తీర్పునిచ్చారు.
ఇక తెలంగాణ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన ఆంధ్రా ఆడకూతురు షర్మిలను అసలు ప్రజలు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆమెకు కేవలం 9.67 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. కేసీఆర్‌ను ఢీకొట్టే నేతగా ఆమెను పరిగణించడం లేదు. వైఎస్ షర్మిల పార్టీ ప్రభావం తెలంగాణలో అస్సలు ఉండదంటూ కుండబద్దలు కొట్టారు. ఆమెకు మనుగడ కష్టమన్నారు. ఈ సర్వేలో మెజార్టీ పీపుల్ షర్మిల తెలంగాణలో రాజకీయంగా రాణించలేరని తేల్చారు.
ఇక ఈ ముగ్గురిలో ఎవరో చెప్పలేమని 8.22 శాతం మంది ఎంపిక చేసుకోలేకపోయారు. కేసీఆర్ ప్రత్యర్థిని కనిపెట్టలేకపోయారు.
ఇలా సర్వేలో దాదాపు 66.15 శాతం మంది కేసీఆర్ కు ప్రత్యర్థిగా రేవంత్ రెడ్డిని గుర్తించడం విశేషం. దీంతో రాబోయే తెలంగాణ రాజకీయాలు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి జైలుకెళ్లినా సరే కేసీఆర్ పైన పోరాటం ఆపలేదు. గట్టిగా పోరాడాడు. ఆ పోరాట ఫలితమే.. ఇప్పుడు ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించేలా చేసింది.
ఏడేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలను గుడ్డిగా నమ్మి పార్టీని తెలంగాణలో మూడోస్థానానికి పరిమితం చేసుకున్న కాంగ్రెస్ అధిష్టానానికి జ్ఞానోదయం అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లతో పనికాదని తెలిసిపోయింది. అందుకే అందరినీ పక్కనపెట్టి ఇప్పుడు పక్క పార్టీ నుంచి వచ్చినా సరే కేసీఆర్‌ను ఢీకొట్టే రేవంత్ రెడ్డికే కాంగ్రెస్ అధిష్టానం పట్టకట్టడం విశేషం.
రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీలో బండి సంజయ్‌లా దూకుడుగల నేతగా రేవంత్ రెడ్డికి పేరుంది. అతడి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. పైగా కాంగ్రెస్ శ్రేణుల్లో విపరీతమైన అభిమానం సొంతం.. ఇన్నాళ్లకు కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందని ఆపార్టీ వర్గాలే అంటున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించడంతో కాంగ్రెస్ కూడా ఇప్పుడు కేసీఆర్‌ను ఢీకొట్టేలా తయారైందని చెప్పొచ్చు.