సీతారామన్‌ను నేను కాల్చిపారేస్తాను. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు....

మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (13:41 IST)
కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను చంపేందుకు ఇద్దరు వ్యక్తులు చాటింగ్ చేసుకున్నారు. సీతారామన్‌ను నేను కాల్చిపారేస్తాను.. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు అంటూ వాట్సాప్ సందేశాలు పంపించుకున్నారు. చివరకు ఈ సందేశాలే వారిని జైలు ఊచలు లెక్కించేలా చేశాయి. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌ జిల్లా ధర్చులాలో మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. మంత్రి పిథోర్‌గఢ్‌కు చేరుకోవడానికి ముందే సోమవారం ఉదయం వారిద్దరినీ అరెస్టు చేశారు. 'సీతారామన్‌ను నేను కాల్చిపారేస్తాను. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు' అని వాట్సాప్ సందేశాలు పంపించుకున్నారు. 
 
అదీకూడా పీకల వరకు మద్యం సేవించి వారు ఈ వాట్సాప్‌లో చాటింగ్ చేసుకున్నారు. ఇందుకోసం ప్రణాళిక కూడా రచించారు. ఈ విషయం ఆ నోటాఈనోటా చేరి చివరకు కేంద్ర నిఘా వర్గాలకు చేరింది. వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగాన్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు.. సందేశాలు పంపించుకున్న ఇద్దరు తాగుబోతులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పిథోర్‌గఢ్‌ ఎస్పీ రామ్‌చంద్ర రాజ్‌గురు తెలిపారు. 
 
మద్యం మత్తులో ఉండి వారు మంత్రి గురించి మాట్లాడుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన చెప్పారు. ఐపీసీలోని 506, ఐటీ చట్టంలోని 66 సెక్షన్ల కింద వారిపై కేసు పెట్టి జైలుకు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు