నేను వైసీపీలో చేరుతున్నా: వల్లభనేని వంశీ కన్ఫర్మ్

గురువారం, 31 అక్టోబరు 2019 (11:53 IST)
ఎట్టకేలకు వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నవంబరు 3 లేదా 4వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటానని వెల్లడించారు. కాగా తెదేపా నుంచి పోటీ చేసి గన్నవరం నుంచి ఎంపికైన వంశీ గత కొన్ని రోజులుగా అటు భాజపా ఇటు వైసీపీతో మంతనాలు సాగించారు. చివరికి వైసీపీ గూటికి వెళుతున్నట్లు ప్రకటించారు.
 
 
పార్టీ వీడుతున్న నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. తన లేఖపై స్పందించినందకు చంద్రబాబుకు వంశీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం హింసను ఎదుర్కొనేందుకు మీ అడుగుజాడల్లో నడిచానని, అన్యాయాన్ని ఎదుర్కొనడంలో మీ మద్దతును గుర్తుంచుకుంటానని చెప్పుకొచ్చారు. జిల్లా పార్టీ మద్దతు లేకపోయినా రాజ్యాంగబద్ధమైన సంస్థల సాయంతో అన్యాయాలపై పోరాడామని గుర్తుచేశారు.
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని, తనపై వచ్చిన ఒత్తిడి మీకు తెలుసని, అయినా వెనక్కి తగ్గలేదన్నారు. కనపడే శత్రువుతో యుద్ధం చేయడం తేలిక అని, కానీ కనపడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టమని వంశీ వ్యాఖ్యానించారు. కార్యకర్తలను వేధింపులకు గురి చేయకుండా అడ్డుకున్నానని ఆయన తెలిపారు. టీడీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భాలను వంశీ లేఖలో గుర్తుచేశారు.
 
గన్నవరంలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉన్నా.. విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని పేర్కొన్నారు. విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ నేతలు, ఐపీఎస్‌ అధికారితో పోరాటం చేసిన విషయాన్ని వంశీ గుర్తు చేశారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు చంద్రబాబుకు వంశీ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు 2 సార్లు అవకాశం కల్పించిన చంద్రబాబుకు వంశీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ హయాంలో ఎక్కువగా నెరవేర్చానని లేఖలో పేర్కొన్నారు.
 
నియోజకవర్గ అభివృద్ధిలో కూడా పాల్గొన్నానని చెప్పారు. గత ఎన్నికల్లో అతికష్టం మీద గెలవాల్సి వచ్చిందని.. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు, కొందరు ఉద్యోగులు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించారు. అయినప్పటికీ తాను ఎన్నికల్లో గెలుపొందాను చెప్పారు.
 
ఎన్నికల తర్వాత అనేక సమస్యలు నన్ను చుట్టుముట్టాయని లేఖలో వంశీ వాపోయారు. రాజకీయంగా తనను వేధిస్తున్నారని, అనుచరులపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే.. తాను రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాని, శాసనసభ సభ్యత్వానికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ ప్రస్తావించారు.
 
అయితే వంశీ లేఖపై చంద్రబాబు స్పందించారు. ‘‘రాజకీయాల నుంచి తప్పుకోవడం సమస్యకు పరిష్కారం కాదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం మన బాధ్యత. అన్యాయం జరిగితే తలదించుకోకుండా పోరాటం చేయాలి.
 
పోరాటంలో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా అండగా ఉంటాను. వైసీపీ ప్రభుత్వం దురుద్దేశంతో మీపై కేసు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటే ఇలాంటివి ఆగవు. ప్రభుత్వ కక్షసాధింపులపై ఐక్యంగా పోరాడదాం.. పార్టీ శ్రేణులకు అండగా నిలబడదాం’’ అని వంశీకి చంద్రబాబు భరోసా ఇచ్చారు. కానీ వంశీ మాత్రం వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు