తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని 2013 జూలైలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన రాత్రే తనను టీఆర్‌ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారని సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. అప్పట్లో తనను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటన్న విషయాన్ని చెప్పలేదన్న ఆమె, 2014లో ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాసైన తర్వాతే తాను కాంగ్రెస్‌లో చేరానని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన నటి విజయశాంతి, తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలు స్వీకరించి, స్టార్ క్యాంపెయినర్‌గా రంగంలోకి దిగారు. ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలపై ఆమె స్పందిస్తూ, ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నామని విజయం సాధిస్తామన్నారు.
తనను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. యుద్ధం అంటే శత్రువులపై యుద్ధమని, తమ శత్రువులను ఓడించి ప్రజలకు మేలు చేస్తామన్నారు. కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారన్నారు. ప్రజలకు మేలు జరగాలనేదే తమ ప్రయత్నమన్నారు. దేవుడు ఇచ్చిన చెల్లెలు అని గతంలో తనను కేసీఆర్ అన్నారని, తాను మాత్రం కేసీఆర్‌ను దేవుడు ఇచ్చిన అన్న అని ఎక్కడా చెప్పలేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.