బడ్జెట్‌ను ప్రభావితం చేసిన రైతుల ఆత్మహత్యలు

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (16:41 IST)
గడచిన దశాబ్ద కాలంగా దేశంలో భారీ సంఖ్యలో చోటు చేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలు 2008-09 కేంద్ర బడ్జెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని చెప్పడం నిర్వివాదాంశం. అంతెందుకు కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఒక రోజు ముందు అనగా గురువారం నాడు రైతుల సమస్యలకు తగిన పరిష్కారం చూపాలంటూ పార్లమెంట్ ఉభయసభల్లోనూ విపక్ష సభ్యులు సభాకార్యక్రమాలను స్థంభింపజేసిన సంగతి తెలిసిందే. రైతుల ఆత్మహత్యలను నివారించే క్రమంలో, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆదుకునే నిమిత్తం యూపీఏ ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చిన కొత్తల్లో దేశంలోని 25 జిల్లాలకు పునరావాస ప్యాకేజీని అందించింది.

ప్యాకేజీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 16 జిల్లాలకు రూ. 9650 కోట్లు, కర్నాటకలోని ఆరు జిల్లాలకు రూ. 2389.64 కోట్లు, కేరళలోని మూడు జిల్లాలకు రూ. 765.24 కోట్లు, మహారాష్ట్రలోని ఆరు జిల్లాలకు రూ. 3,879.26 కోట్లను పునరావాస ప్యాకేజీ రూపంలో పంపిణీ చేసింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ గణాంకాలను అనుసరించి 1997 నుంచి 2005 మధ్య కాలంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రైతుల ఆత్మహత్యల గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. 1997 సంవత్సరంలో మహారాష్ట్ర 1917, ఆంధ్రప్రదేశ్ 1097, కర్నాటక 1832 మరియు మధ్యప్రదేశ్‌లో 2390 రైతు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి.

అదే 2005 సంవత్సరంలో మహారాష్ట్ర 3926, ఆంధ్రప్రదేశ్ 2490, కర్నాటక 1883 మరియు మధ్యప్రదేశ్ 2660 రైతు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. పైన పేర్కొన్న గణాంకాలను పరిశీలించినట్లయితే ఎనిమిది సంవత్సరాల కాలంలో రైతుల ఆత్మహత్యలు రెట్టింపు కావడం గమనార్హం. అలాగే ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో చోటు చేసుకున్న రైతుల ఆత్మహత్యల సంఖ్య వ్యవసాయ రంగ సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపుతోంది. ఎనిమిది సంవత్సరాల కాలంలో మొత్తం రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలో 28,911, ఆంధ్రప్రదేశ్‌లో 16770, కర్నాటకలో 20093, మధ్యప్రదేశ్‌లో 23588 నమోదయ్యాయి. నాలుగు రాష్ట్రాల్లో మొత్తం సంఖ్య 89,362 గా గుర్తించడం జరిగింది.

వెబ్దునియా పై చదవండి