సామాన్యులకు కొండంత అండ: ప్రధాని

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (14:12 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ సామాన్య, మధ్య తరగతి ప్రజలు మరియు రైతుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడేందుకు బడ్జెట్ సమతుల్యతను పాటించిందని ప్రధాని అన్నారు. గ్రామీణ ప్రజలకు ఉద్దేశించిన పథకాల అమలు రాష్ట్రాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. బడ్జెట్‌ను అనుసరించి రాష్ట్రాలకు రూ. 65,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని మన్మోహన్ సింగ్ తెలిపారు.

కేటాయింపులో 45 శాతాన్ని బీహార్, ఒరిస్సా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రాల సమాహారంగా దేశం భాసిల్లుతున్నందున రాష్ట్రాల్లో కేంద్ర కేటాయింపుల సద్వినియోగం ప్రధాన సవాలుగా మారిందని అన్నారు. కేటాయింపుల సక్రమ అమలుకు రాష్ట్రాలు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. పంచాయితీరాజ్ కేటాయింపుల సక్రమ అమలును పర్యవేక్షించడం ప్రధాన అజెండగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగ వృద్ధి రేటు పట్ల ఆందోళన తెలిపిన ప్రధాని, ఆహార దిగుబడి రికార్డు స్థాయిలో ఉండటం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి