గాంధీ హృదయాన్ని దొంగలించిన ప్రేమరాణి...

WD

FileFILE
యావత్ భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు అహింసను ఆయుధంగా చేసుకుని తెల్లదొరల మెడలు వంచిన మహాత్మా గాంధీ తన 50వ ఏట ప్రేమలో పడ్డారు?!... ఈ సంగతిని ఆయన మునిమనవడైన 71 సంవత్సరాల రాజ్‌మోహన్ గాంధీ, 'మోహన్ దాస్: ఏ ట్రూ స్టోరీ ఆఫ్ ఏ మ్యాన్' అనే మకుటం కలిగిన పుస్తకంలో అక్షరబద్ధం చేశారు. తాజాగా విడుదలైన ఈ పుస్తకంలో మహాత్మా గాంధీ వ్యక్తిగతజీవితం తాలూకు ఆసక్తికరమైన అంశాలు పొందుపరచబడ్డాయి. మోహన్‌ దాస్ కరమ్ చంద్ గాంధీ ప్రేమ వృత్తాంతానికి సంబంధించిన వివరాలకు గాను పుస్తకంలో నాలుగు పేజీలను కేటాయించారు.

పుస్తకపు పుటలను కదిలించినట్లయితే... "తన యాభైవ పడిలో, 29 సంవత్సరాల సరళా దేవీ ప్రేమను గాంధీ చూరగొన్నారు. మంచి గాయనిగా పేరొందిన సరళాదేవి విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు వరుసకు మేనకోడలు (చెల్లెలి కుమార్తె) అవుతారు. సరళాదేవి భర్త రామ్ భుజ్ దత్ చౌదరి లాహోర్‌లోని ఒక పత్రికకు సంపాదకునిగా వ్యవహరిస్తుండేవారు. విరామెరుగక స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించడంతో సరళాదేవిని కలుసుకునే నిమిత్తం తరుచుగా లాహోర్‌కు విచ్చేసే అవకాశం మహాత్మా గాంధీకి చిక్కేది కాదు. ఇదిలా ఉండగా సరళాదేవీని ప్రశంసిస్తూ గాంధీ రాసుకున్న రాత ప్రతులు ఆమె భర్త రామ్ భుజ్ చౌదరి కంటపడటంతో కుటుంబ స్థాయిలో ఈ వ్యవహారం దుమారాన్ని రేపింది. మహాత్మా గాంధీ కుమారుడైన దేవదాస్ జోక్యం చేసుకోవడంతో వ్యవహారం సామరస్యంగా పరిష్కరించబడింది."

ఈ సంగతిని స్వయానా మహాత్మా గాంధీ ముని మనవడు రాజ్ మోహన్ గాంధీ తన పుస్తకంలో ప్రధానంగా ప్రస్తావించడంతో ఇందులోని నిజానిజాలను గురించి చర్చించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఎంతవారలైనా ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడతారనేందుకు 'మోహన్ దాస్: ఏ ట్రూ స్టోరీ ఆఫ్ ఏ మ్యాన్' పుస్తకం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి