వాలెంటైన్స్ డే... చరిత్ర ఇదే... ఉరి తీసిన రోజు...

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (14:58 IST)
ప్రేమికుల రోజు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెల్లు, స్నేహితులపై ప్రేమను వ్యక్తపరచడానికి ఒక ప్రత్యేకమైన రోజు లేదు. కానీ తాను ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం ఒక రోజు ఉంది. అదే ప్రేమికుల రోజు (వాలెంటైన్స్‌ డే). ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి, వర్ణనాతీతం. ఇటువంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ప్రతీ రోజు ప్రేమికులు తిరుగుతుంటారు, మాట్లాడుకుంటారు. కానీ ప్రేమికుల రోజు మాత్రం వారికి ప్రత్యేకం. అసలు ఫిబ్రవరి 14న ఎందుకు ప్రేమికుల రోజును జరుపుకోవాలి అని అనుకుంటున్నారా.. ఐతే ఇది చదవాల్సిందే.
 
క్రీస్తు శకం 270 ప్రాంతంలో రోమ్‌లో వాలెంటైన్స్‌ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడు. ప్రేమ వల్ల ప్రపంచం ఆహ్లాదంగా, ఆనందంగా మారుతుందని అతని అభిప్రాయం. అందుకే రహస్యంగా యువతీ యువకులకు ప్రేమోపదేశాలు చేసి, వారిలో ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం ప్రారంభించాడు. వాలెంటైన్స్‌కి రోజురోజుకు అభిమానులు పెరిగిపోవడంతో రోమ్‌ రాజు క్లాడియస్‌కి భయం పట్టుకుంది. 
 
దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారుచేస్తున్నాడన్న అభియోగంపై క్లాడియస్‌ వాలెంటైన్‌కి మరణశిక్ష విధించాడు. వాలెంటైన్‌ అభిమానుల్లో క్లాడియస్‌ కుమార్తె కూడా ఉండటం విశేషం. ప్రేమకు మారుపేరుగా మారిన వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరితీశారు.
 
వాలెంటైన్‌ మరణించిన తరువాత రెండు దశాబ్దాలకు క్రీ.శ. 496లో అప్పటి పోప్‌, గెలాసియస్స్‌ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌ డేగా ప్రకటించాడు. ఎక్కడో రోమ్‌లో, అదీ శతాబ్దాల క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచం ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది.

వెబ్దునియా పై చదవండి