ఇంటి మేడ మీదకి మెట్లు నిర్మించేటప్పుడు ఒక వరుస మెట్లను తూర్పు నుండి పడమరకు లేదా ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మిస్తే మంచిది. మెట్లను రెండు వరుసలుగా నిర్మించాలనుకుంటే.. మొదటి వరుస మెట్లను తూర్పు నుండి పడమరకు వెళ్ళే విధంగానూ, రెండో వరుస మెట్లను ఎటుపక్క తిరిగినా కూడా పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా ఉండాలి.
రెండు వరుసల మెట్లను.. ఒక వరుస ఉత్తరం నుండి దక్షిణం వైపుకు, రెండో వరుస ఎటు తిరిగినా దక్షిణం నుండి ఉత్తరానికి ఎక్కేటట్లుగా కూడా నిర్మించుకుంటే చాలా మంచిది. ఎల్ ఆకారంలో ఇంటి మెట్లను నిర్మించాలి అనుకునేవారు ముందుగా తూర్పునుండి పడమర వరకుగానీ, ఉత్తరం నుండి దక్షిణానికి గానీ ఎక్కి అటు తరువాత ఎటువైపుకైనా తిరిగేలా ఏర్పాటు చేసుకోవాలి.
ఇంటికి బయటవైపున మెట్లను నిర్మించాలి అనుకుంటే.. ఈశాన్య, వాయువ్య, నైరుతి, ఆగ్నేయ దిశలలో ఏ భాగాలలనైనా నిర్మించవచ్చు. ఈశాన్య దిశగా మెట్లను నిర్మించేటపుడు ఇంటికి మార్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యాల వైపు నేరుగా ఉండేలా మెట్లు నిర్మాణం చేపట్టవచ్చు. అలానే ఈశాన్యం వైపు నిర్మించే మెట్లు ప్రహరీగోడకు ఏ మాత్రం తగలకుండా దూరంగా ఉండాలి.