పాలకూర పకోడీలు ఎలా చేయాలి?

FILE
పాలకూరలో ఉన్న పోషకాలు మరి ఎందులోను అంత ఎక్కువగా ఉండవని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఇందులో ఉన్న పోషకాలు ఏంటో తెలుసుకుందాం. విటమిన్‌ ఏ, సీ, పీచుపదార్థం‌, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియంలు అధిక మోతాదులో ఉన్నాయి. అలాంటి పాలకూరలో పకోడీలు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం..

కావలసిన పదార్థాలు:
పాలకూర - 2 కట్టలు (సన్నగా తరగాలి).
కొత్తిమీర తురుము - 2 టీ స్పూన్లు.
పచ్చిమిర్చి - 10 (సన్నగా కోయాలి).
శనగపిండి - 1/4 కిలో.
బియ్యపు పిండి - 2 టీ స్పూన్లు.
మంచినీళ్లు - తగినన్ని.
అల్లం (కోరినది) - 1 టీ స్పూను.
ఉప్పు - తగినంత.
నూనె - తగినంత.
జీలకర్ర పొడి - అర టీ స్పూను.

తయారీ విధానం:
ముందుగా గిన్నెలో పాలకూర తురుము వేసి అందులో కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి, కారం, అల్లం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి చేత్తో కొద్దిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులోనే బియ్యపు పిండి, శనగపిండి వేసి కొద్దిగా నూనె వేడి చేసి పోసి తగినన్ని నీళ్లు పోసి పకోడిపిండిలా కలపాలి.

స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె పోసి, నూనె వేడయ్యాక పకోడీలకు సిద్ధం చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా పకోడీల్లా వేస్తూ దోరగా వేయించి తీయాలి. ఈ పకోడీలను వేడి వేడి అన్నంలోకి సైడిష్‌గా మాత్రమే గాకుండా, పిల్లలకు నచ్చేలా సాస్‌తోనూ సర్వ్ చేయొచ్చు.

వెబ్దునియా పై చదవండి