వెజ్ ఖీమా టేస్టీగా ఎలా చేయాలో తెలుసా?

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (20:56 IST)
మటన్ ఖీమా, చికెన్ ఖీమా కర్రీలంటే నాన్ వెజ్ ప్రియులకి ఎంతిష్టమో. మరి వెజిటేరియన్స్ కూడా అంతే టేస్టుగా వెజ్ ఖీమా కర్రీ కూడా చేసుకోవచ్చు. సోయాతో చేసిన మీల్ మేకర్లతో ఖీమా కర్రీని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. 
 
కావాల్సిన పదార్థాలు:
సోయా గ్రాన్యూల్స్ - రెండు కప్పులు, 
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను,
ఉల్లిపాయలు - రెండు,
పచ్చిమిర్చి - నాలుగు,
బంగాళాదుంపలు - మీడియం సైజువి రెండు, 
కారం - అరటీస్పూను,
పసుపు - అర టీస్పూను,
జీలకర్రపొడి - అరటీస్పూను,
ధనియాల పొడి - ఒక టీస్పూను,
గరం మసాలా - ఒక టీస్పూను,
పలావు ఆకు - రెండు,
జీలకర్ర - ఒక టీస్పూను,
కొత్తిమీర తురుము - ఒక టీస్పూను,
టొమాటో గుజ్జు - మూడు టేబుల్ స్పూనులు,
నూనె - సరిపడినంత,
ఉప్పు - తగినంత 
 
తయారుచేసే విధానం: 
బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసేయాలి. వాటిని చిన్నముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సోయా గ్రాన్యూల్స్‌ను కూడా వేడి నీళ్లలో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. అనంతరం చల్లనినీళ్లలో వేసి, పిండేసి నీళ్లు లేకుండా చేసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి అర నిమిషంపాటూ తిప్పాలి. పేస్టులా కాకుండా.. తరుగులా చేసుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి... కాస్త నూనె వేయాలి. అందులో జీలకర్ర, పలావు ఆకులు వేసి వేయించాలి. అరనిమిషం తరువాత ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. అందులో కాస్త పసుపు, కారం కూడా వేసి కలపాలి.
 
తరువాత జీలకర్రపొడి, ధనియాల పొడి, గరంమసాలా కూడా వేసి బాగా వేయించాలి. కాసేపయ్యాక టొమాటో గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. అవి బాగా వేగాక... ముందుగా కోసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, మిక్సీలో వేసిన సోయా గ్రాన్యూల్స్‌ను వేసి బాగా కలపాలి. అన్నీ కలిసి బాగా ఉడికే వరకు ఉంచాలి. అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. లేదా చిన్న మంటమీద నీళ్లు లేకుండా ఉడికించుకోవచ్చు. కనీసం అయిదు నుంచి ఎనిమిది నిమిషాల ఉడికిస్తే ఖీమా కర్రీ సిద్ధమైపోతుంది. స్టవ్ మీద నుంచి దించే ముందు కొత్తిమీర చల్లుకుంటే సరి. వెజ్ ఖీమా రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు