కందిపప్పు ధర విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో.. దానికి ప్రత్యామ్నాయంగా, రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండే వేరుశెనగ సాంబారు చేసుకోవటం ఎలాగో చూద్దామా..?!
కావలసిన పదార్థాలు : వేరుశెనగ పప్పు.. ఒక కప్పు ఆవాలు, జీలకర్ర, ధనియాలు... తలా ఒక్కో టీ. చింతపండు గుజ్జు.. పావు కప్పు పచ్చిమిర్చి.. నాలుగు మునక్కాడలు, టొమోటోలు, ఉల్లిపాయలు.. తలా రెండు చొప్పున వెల్లుల్లి రెబ్బలు.. ఎనిమిది ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు.. తాలింపుకు సరిపడా కరివేపాకు, కొత్తిమీర.. తగినంత
తయారీ విధానం: ముందుగా వేరుశెనగ పప్పును వేయించి, చల్లారిన తరువాత పొట్టు తీయాలి. ఈ పలుకులకు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలను చేర్చి ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనక్కాడలు, టొమోటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలను విడిగా ఒక పాత్రలో తీసుకుని తగినంత ఉప్పు చేర్చి, అర టీస్పూన్ పసుపు వేసి ఉడికించాలి.
తరువాత చింతపండు గుజ్జు చేర్చి, ఆపై ముందే సిద్ధం చేసి ఉంచుకున్న వేరుశెనగ మిశ్రమాన్ని కూడా కలిపి సన్నటి మంటపై ఉడికించాలి. ఇప్పుడు ఒక బాణలిలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో తాలింపు చేసి ఉడుకుతున్న సాంబారులో కలపాలి. దించేముందు కరివేపాకు రెబ్బలు, కొత్తిమీరతో అలంకరిస్తే వేడి వేడి వేరుశెనగ సాంబారు తయార్..! ఓ పట్టు పట్టేద్దాం వచ్చేయండి మరి..!!