స్మార్ట్ ఫోన్ పుణ్యంతో మానవీయ విలువలు గంగలో కలిసిపోతున్నాయి. అధికంగా స్మార్ట్ ఫోన్స్ వాడే వారి సంఖ్య దేశంలో గణనీయంగా పెరిగింది. అయితే అధికంగా సెల్ ఫోన్‌ను ఉపయోగిస్తే.. వ్యక్తిగతంగానే కాకుండా ఉద్యోగ నిర్వహణతో పాటు సమాజంలో అనేక ఇబ్బందులు ఎదురుకాకతప్పదు. 182 మంది కళాశాల విద్యార్థుల నుంచి రోజువారీ స్మార్ట్‌ఫోన్ వాడకంపై రూపొందించిన నివేదికలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
స్మార్ట్‌ఫోన్‌కు బానిసలైనవారు సామాజిక మాధ్యమాలను అధికంగా ఉపయోగించడం, వీడియో గేమ్స్, స్నేహితులతో చాటింగ్ చేస్తుండడం, ఆన్‌లైన్ షాపింగ్, అశ్లీల చిత్రాలను చూడటం వంటి వాటికే గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారని తేలింది. అలాంటి వారిలో ఒత్తిడి, సిగ్గు, ఆత్మన్యూనతా భావాలు ఎదురవుతున్నాయని నివేదిక ద్వారా తేలింది.
స్మార్ట్ ఫోన్లను వాడే వారు వ్యక్తిగత, సమాజ జీవితాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇంకా కార్యాలయాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం ద్వారా ఇబ్బందులు తప్పట్లేదని ఆ నివేదిక తేల్చింది. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో అధికశాతం మంది మహిళలే ఉండడం గమనార్హం. ఇంకా పిల్లల్లోనూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి అలవాట్ల బారిన పడితే ఫోన్ రింగ్ అయినా కాకపోయినా తరుచూ దాన్ని చూసుకుంటుంటారని, ఫోన్ దగ్గరలేకపోతే ఏదో కోల్పోయినట్లు భావించే వారు కూడా ఉన్నారని అమెరికాకు చెందిన రీ స్టార్ట్ లైఫ్ సెంటర్ నివేదిక వెల్లడించింది.