మహిళలు...1091కు ఫిర్యాదు చేయండి: సబితా

రాష్ట్రంలోని మహిళలకు ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు హోంశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

మహిళలకు రక్షణ అనే అంశంపై శుక్రవారం రాష్ట్ర హోంశాఖ జూబ్లీహాలులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ...మహిళలు నిర్భయంగా తమ సమస్యలగురించి 1091 అనే టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేయవచ్చని ఆమె తెలిపారు.

మహిళలపై యాసిడ్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాష్ట్రంలోని మహిళా పోలీసు స్టేషన్ల సంఖ్య పెంచేందుకు తగిన చర్యలు చేపట్టినున్నామని, మహిళలు తమ సమస్యలను ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని ఆమె మహిళాలోకానికి పిలుపునిచ్చారు.

ఇదిలావుండగా తాము ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబరు ప్రతి మహిళకు ఉపయోగపడుతుదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా రాష్ట్రంలో పెరిగిపోతున్న ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేందుకుకూడా చట్టాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఎవరైనా విద్యార్థి లేదా విద్యార్థిని ర్యాగింగ్‌కు పాల్పడే వారికి మూడు సంవత్సరాలపాటు రాష్ట్రంలో ఎక్కడా చదువుకునే అవకాశం లేకుండా చేస్తామని ఆమె తెలిపారు.

వెబ్దునియా పై చదవండి