గర్భావస్థలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండిలా...

సోమవారం, 30 నవంబరు 2009 (16:54 IST)
FILE
మహిళలు గర్భావస్థలోనున్నప్పుడు సన్‌స్క్రీన్ లోషన్‌ను తప్పని సరిగా ఉపయోగించాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే స్త్రీలు గర్భం ధరించినప్పుడు వారి చర్మం పొడిబారిపోతుంటుంది. దీంతో సూర్యుని అతి నీల లోహిత కిరణాల కారణంగా శరీర చర్మం మరింత పొడిబారిపోతుంది. ఇలా పొడిబారిపోవడం వలన చర్మంపై ముడతలు ఏర్పడుతుంది. అతి నీల లోహిత కిరణాల కారణంగా చర్మం కోమలత్వాన్ని కోల్పోతుంది. ఈ కారణంగా చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు వైద్యులు.

స్త్రీలు గర్భావస్థలోనున్నప్పుడు చర్మాన్ని మృదువుగా, పట్టులా ఉండేలా చూసేందుకు మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి. కొందరి చర్మం ఆయిలీగా వుంటుంది కాబట్టి ఇలాంటి వారు ప్రతి రోజు ఆయిల్ బేస్డ్ లేనటువంటి మాయిశ్చరైజర్‌నుపయోగించాలి. నీళ్ళలావున్న మాయిశ్చరైజర్ తేలికగా, చర్మంలో కలిసిపోయేదిగా ఉంటుంది. ఇలాంటి మాయిశ్చరైజర్ ఉపయోగించడం వలన శరీర చర్మం మృదువుగాను పట్టులా తయారువుతుందంటున్నారు వైద్యులు.

అదేగనుక మీ చర్మం పొడిబారినట్లుంటే చర్మంపై నవ్వ(జిల) పుడుతుంది. కాబట్టి గర్భావస్థలోనున్నప్పుడు చర్మంలో తేమశాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

చాలా మంది మహిళలకు గర్భావస్థలోనున్నప్పుడు శరీరం, కాళ్ళలో నొప్పులు ఎక్కువగా ఉంటుందని వైద్యులకు ఫిర్యాదు చేస్తుంటారు. దీనికంతటికి కారణం వారికి నిద్ర సరిగా పట్టక పోవడమే. ఇలాంటి స్థితిలోనున్న మహిళలు ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు తల, కాళ్ళకు మాలిష్ చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఇలా మాలిష్ చేయించుకోవడం వలన శరీరంలోని కండరాలకు మంచి వ్యాయామం కలిగి రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. దీంతోపాటు నిద్ర కూడా బాగా పడుతుంది. నీరు అధికంగా సేవిస్తుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. నీటిని సేవించడం వలన శరీరంలోని వ్యర్థపదార్థాలను విసర్జించేలా చేస్తుంది. కాబట్టి చర్మం శుభ్రంగా, మృదువుగా, పట్టులా మెరిసేందుకు ప్రతి రోజు 8 నుంచి 10 గ్లాసుల నీటిని సేవిస్తుండండి. ఇది ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతో లాభదాయకంగా ఉంటుందంటున్నారు వైద్యులు.

వెబ్దునియా పై చదవండి