హైదరాబాద్‌ను, మసాలా టీని మర్చిపోలేను..

భోపాల్ విషవాయు దుర్ఘటన నేపధ్యంలో వాస్తవ జీవితం ఆధారంగా నూతన చిత్రం తీసేందుకు భారత్ విచ్చేసిన లండన్ నటి, దర్శకురాలు మిష్చా బార్టన్ భారతీయ సంస్కృతికి దాసోహమైపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్న 22 ఏళ్ల లండన్ నటి, ఈ నగర సాంప్రదాయాల మధురిమను బహు చక్కగా ఆస్వాదిస్తోంది. పైగా తాను ఇక్కడ సితార్ నేర్చుకుంటున్నానని సంతోషం ప్రకటించింది.

తన భారత్ పర్యటనలో హిందూ ఆలయాలను సందర్శించడం, బౌద్ధమతం గురించి తెలుసుకోవడం ద్వారా భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచ అన్వేషణలో మునిగి తేలుతున్నాని మిష్చా ప్రకటించింది. హిందూ, బౌద్ధ మతాలు అతి సుందరమైన మతాలని ఆమె ప్రశంసించింది.

తన భారతీయ పర్యటన అనుభవాలపై స్వంత బ్లాగులో రాస్తున్న మిష్చా ప్రత్యేకించి హైదరాబాద్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ నగరంలో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు సామరస్యంగా జీవించడం నిజంగా స్పూర్తి కలిగిస్తోందని ఆమె కొనియాడింది. అంతకుమించి హైదరాబాద్ మసాలా ఛాయ్‌ అంటే మిష్చా పడి చస్తోంది.

మొదట్లో ఇక్కడి ప్రజలు యోగా అభ్యసించడం, మరోవైపు పిచ్చిగా ఛాయ్ తాగడం చూసి ఇదెక్కడి ఆరోగ్య పద్ధతి అని ఆశ్చర్యపోయానని చెప్పింది. అయితే ఇప్పుడు తానే హైదరాబాదీ మసాలా ఛాయ్‌కి దాసోహమైపోయానని, పాలు, చక్కెర కలిపి చేసే ఈ సాంప్రదాయిక టీ అంటే తనకిప్పుడు చెప్పలేనంత ఇష్టంగా ఉంటోందని ఆమె చెప్పింది. బ్రిటన్ నివాసిగా బ్రేక్‌ఫాస్ట్ టీని మాత్రమే ఇష్టపడే పడే తాను ఇప్పుడు హైదరాబాద్ మసాలా ఛాయ్‌కి బాగా అలవాటు పడిపోయానని చెప్పింది.

పైగా ఈ నగరంలో సితార్‌ను నేర్చుకోవడంతో తనకు పట్టలేనంత సంతోషంగా ఉందని మిష్చా చెప్పింది. ఒకరకంగా చెప్పాలంటే సితార్‌ నేర్చుకునే లక్ష్యంతోటే తాను హైదరాబాద్ నగరానికి వచ్చానని, ఇక్కడ మంచి సితార్ గురువును పొందడం అంత సులభం కాదని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి