ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి జాతి శుక్రవారం ఘన నివాళులు అర్పించింది. బుధవారం ఉదయం నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, మరో నలుగురు అధికారులు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ అంతిమయాత్రకు హైదరాబాద్‌లో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి.

దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హోం మంత్రి చిదంబరం, ఇతర మంత్రులు వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్ సహా ఇతర రాజకీయ ప్రముఖులు శుక్రవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ భౌతికకాయానికి ఘన నివాళులు అర్పించారు. ఏఐసీసీ యువ నేత రాహుల్ గాంధీ కూడా వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దేశ రాజకీయ ప్రముఖులు సీఎం క్యాంపు కార్యాలయంలో తమ సంతాప సందేశాన్ని రాశారు. వైఎస్సార్ గౌరవార్థం దేశ రాజధానిలో, రాష్ట్ర రాజధానుల్లో జాతీయ జండాను సగానికి అవనతం చేశారు. ప్రజల సందర్శనార్థం శుక్రవారం మధ్యాహ్నం వరకు వైఎస్సార్ భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ఉంచుతారు. అనంతరం ఆయన సొంత ఎస్టేట్ ఇడుపులపాయలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

వెబ్దునియా పై చదవండి