ప్రతి ఒక్కరూ మగబిడ్డ పుట్టాలని కోరుకుంటారు. ఇందుకోసం చేయని పూజంటూ ఉండదు.. మొక్కని దేవుడంటూ ఉండరు. అంతేకాకుండా, తమకు తెలిసిన మంత్రగాళ్ళ వద్దకు వెళ్లి... మగపిల్లాడే పుట్టేలా అంత్రాలు, తాయిత్తులను చేతికట్టుకుంటారు. కానీ, మగపిల్లాడే పుట్టాలంటే ఇలా చేస్తే సరిపోతుందని సాక్షాత్ ఆయుర్వేదిక్ కోర్సులో ఉన్న ఓ పుస్తకంలో చెప్పడం జరిగింది. అంతేనా మగ పిల్లాడు పుట్టాలంటే ఇలా చేయండంటూ కొన్ని టిప్స్ కూడా సూచించారు.
ఈ పుస్తకం బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్, మెడిసిన్ అండ్ సర్జరీ మూడో యేడాది టెక్ట్స్‌బుక్‌లో ఉంది. ఇందులో ఓ చిన్న చిట్కా పేర్కొన్నారు. అదేంటంటే తూర్పు లేదా ఉత్తరం దిక్కుగా ఉన్న రెండు మర్రిచెట్టు ఆకులను తీసుకొని అందులో ఖచ్చితంగా రెండు జీలకర్ర గింజలను వేసి నూరి, ఆ మిశ్రమాన్ని గర్భవతి అయిన మహిళ పుష్య నక్షత్ర సమయంలో పెరుగుతో కలిపి తినాలని ఆ బుక్కులో రాశారు.
ఇదొక్కటే కాదు మగ పిల్లాడు పుట్టాలంటే.. మరో ఐదు ప్రక్రియలను కూడా ఆ బుక్కులో వివరించడం గమనార్హం. గర్భవతి అయిన మహిళకు అధిక మోతాదులో బంగారం, వెండి, ఇత్తడి మిశ్రమాన్ని తినిపించాలన్నది అందులో ఒక ప్రక్రియ. ఈ మూడింటి మిశ్రమంతో ఓ బాలుని ప్రతిమ చేసి.. దానిని కరిగించి పెరుగు, పాల మిశ్రమంలో కలిపి అదే పుష్య నక్షత్ర సమయంలో తీసుకుంటే ఫలితం ఉంటుందని ఆ పుస్తకంలో వివరించారు.
అయితే, ఈ పుస్తకంలో పేర్కొన్న చిట్కాలు మూఢ నమ్మకాలను మరింత పెంచేలా ఉన్నాయని పలువురు సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పుస్తకం రాజ్యాంగ విరుద్ధమని ప్రముఖ సామాజిక కార్యకర్త వర్ష దేశ్‌పాండే అన్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడం చాలా ప్రమాదకరమని, రాజ్యాంగం మనకు ఇచ్చిన సమానత్వానికి ఇది విరుద్ధమని ఆమె స్పష్టంచేశారు.