ఏలూరు మిస్టరీ వ్యాధి: ‘సీసం’ కారణమని ఎయిమ్స్ నిపుణుల నిర్ధారణ... ఒంట్లోకి ఎలా వెళ్లింది?
మంగళవారం, 8 డిశెంబరు 2020 (14:43 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నగరంతో పాటుగా సమీపంలోని కొన్ని గ్రామాలను కలవరపరుస్తున్నఅంశంలో అసలు సమస్య కారణాల అన్వేషణ వేగవంతమయ్యింది. పలు సందేహాలు, అనేక అనుమానాల మధ్య ఉన్నత స్థాయి వైద్యాధికారుల బృందాలు పరిశీలన ఉధృతమయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా రంగంలో దిగారు. జాతీయ స్థాయి నిపుణులు కూడా ఏలూరు వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వైద్యరంగానికి చెందిన పరిశోధకులు ఏలూరులో అంతుచిక్కని సమస్యకి అసలు కారణాలు కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పటికే దిల్లీ ఎయిమ్స్‌కి పంపించిన శాంపిళ్లలో ప్రాధమిక నివేదిక వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వానికి అది పంపించారు. దాని ప్రకారం బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలలో అత్యధికంగా లెడ్ ఉన్నట్టు గుర్తించారు. నికెల్ కూడా ఎక్కువ మోతాదులో ఉందనే విషయాన్ని కనుగొన్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వెల్లడించారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం అంతా అనుమానినించినట్లే పేషెంట్ల బ్లడ్ శాంపిల్స్‌లో ఎక్కువగా సీసం (లెడ్), నికెల్ అనే భారలోహాలు ఎక్కువుగా ఉన్నట్లు ఎయిమ్స్ దిల్లీ పరీక్షల్లో తెలిసింది.
లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తాయని చెప్తున్నారు. ఇది ఎక్కువగా బ్యాటరీలలో ఉండే పదార్థం. తాగు నీటి ద్వారా, లేదా పాల ద్వారా పేషెంట్స్ శరీరంలో వెళ్లి ఉండవొచ్చని అంచనా. ఇదిలావుంటే.. ఏలూరులో అంతుచిక్కని జబ్బు కొనసాగుతూనే ఉంది. కొత్తగా వ్యాధి లక్షణాలతో ఆస్పత్రి పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దాదాపు 50 మంది ఆస్పత్రిలో చేరారు.
మరోవైపు కేంద్ర బృందాలు రంగంలో దిగాయి. నగరానికి తాగునీటి సరఫరా చేసే పైప్ లైన్ పరిశీలించారు. అనంతరం తీవ్రంగా ప్రభావితం అయిన డివిజన్‌లలో పలు ఇళ్లకు వెళ్లి ఆహార పదార్థాలు, ఇతర శాంపిల్స్ సేకరిస్తున్నారు. వీటిని పూర్తిగా పరిశీలించేందుకు లాబ్స్‌కి పంపిస్తామని ఎన్ఐఎన్ ప్రతినిధి డాక్టర్ శ్రీనివాస్ బీబీసీకి తెలిపారు. ఇప్పటి వరకూ ప్రాథమిక అంచనాలు తప్ప, పూర్తిస్థాయిలో నిర్ధారణ లేదన్నారు.
నీళ్లు, పాల శాంపిల్స్ పరిశీలన...
సాంపిల్స్ టెస్ట్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిమ్స్ మంగళగిరి ద్వారా అందజేశారు. వెంటనే ఏ మార్గం ద్వారా వారి శరీరాల్లో ప్రవేశించిందో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ స్థానికంగా తెలుసుకోవాలి. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్. వాటర్, పాల శాంపిల్స్ పంపించాలని ఎయిమ్స్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడుగుతోంది. అంటూ ఆయన పేర్కొన్నారు.
ఎయిమ్స్ దిల్లీ నుంచి నివేదికకు అనుగుణంగానే మంగళగిరికి చెందిన వైద్య బృందం అభిప్రాయం కూడా ఉంది. ఏలూరుని వివిధ ప్రాంతాల్లో సోమవారం ఈ బృందం పర్యటించింది. పలువురితో మాట్లాడింది. పలు అంశాలను పరిశీలించింది. అనంతరం ఎయిమ్స్ మంగళగిరి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ కక్కర్ మీడియాతో మాట్లాడారు.
''వింత సమస్యలతో ఎక్కువ మంది ఆస్పత్రులు పాలుకావడంపై అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నాం. భార లోహాల మూలంగా ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. నీటిలో సీసం, ఆర్గానో క్లోరిన్ కలిసినప్పుడు కూడా ఇలాంటి సమస్య వస్తుంది'' అని చెప్పారు. ''బయట ప్రాంతాలలో కొంత మంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారు నిత్యం ఏలూరు వచ్చి వెళ్తూ ఉండేవారని అంచనా. వరి పంట సాగులో రైతులు వాడే క్రిమిసంహారక మందుల మూలంగా కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. పూర్తి కారణాలను కనుక్కుంటున్నాము. భయాందోళనలు అవసరం లేదు'' అని పేర్కొన్నారు.
పెరుగుతున్న బాధితుల సంఖ్య
ఇదిలావుంటే.. మూర్ఛ తరహాలో స్పృహ కోల్పోవడం, నోటిలో నురగ, కొందరికి వాంతులు, విరేచనాలు అవుతోంటే.. నోటి నుంచి రక్తం కూడా కొందరిలో కనిపిస్తోంది. ఇలాంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సోమవారం రాత్రికి ఈ సంఖ్య 500 దాటిందని అధికారికంగా ధృవీకరించారు. వారిలో 340 మందిని డిశ్చార్జ్ చేసినట్టు ఏలూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుమార్ బీబీసీకి తెలిపారు. మెరుగైన వైద్యం కోసం 19 మందిని గుంటూరు, విజయవాడ ఆస్పత్రులకు తరలించినట్టు ఆయన వివరించారు. ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే ఎక్కువ మంది కోలుకోవడం ఉపశమనం కలిగించే అంశంగా ఆయన అంటున్నారు. ఏలూరు నగరంలోని కొత్త ప్రాంతాల్లో కూడా బాధితులు నమోదయ్యారు. సమీపంలోని దెందులూరు నియోజకవర్గం, ఏలూరు రూరల్ మండలంలోని కొన్ని గ్రామాల నుంచి బాధితులు ఆస్పత్రిలో చేరారు.
మళ్లీ ఆస్పత్రిలో చేరిన నలుగురు బాధితులు
ఇలాంటి సమస్యలతో సతమతమవుతూ పదే పదే ఫిట్స్ వచ్చిన కారణంగా శ్రీధర్ అనే వ్యక్తి ఇప్పటికే మరణించారు. అదే విధంగా ఆస్పత్రిలో చేరి, కోలుకుని డిశ్ఛార్జ్ అయిన కొందరిలో మళ్లీ అవే లక్షణాలు కనిపించడం మరో ఆందోళనగా మారింది. ఏలూరు నగరానికే చెందిన నలుగురిని ఇలా రెండోసారి ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
సీసీఎంబీ నివేదికతో కొలిక్కి వచ్చేనా?
ఇప్పటికే వివిధ శాంపిళ్లను పుణె పరిశోధనా శాలకు, దిల్లీ ఎయిమ్స్‌కి పంపించారు. హైదరాబాద్ లోని సీసీఎంబీకి కూడా నమూనాలు చేరాయి. 36 గంటల్లోకి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి అవి చేరవచ్చని ఏపీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ గీత ఆశాభావం వ్యక్తం చేశారు. సీసీఎంబీ నివేదిక వస్తే మరింత స్పష్టత రావచ్చని ఆమె బీబీసీతో చెప్పారు. ఇప్పటికే ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ బృందాలు కూడా పరిశీలిస్తున్నాయని, తుది అంచనాకి రావడానికి సీసీఎంబీ రిపోర్ట్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
నీటి నమూనాలను లోతుగా పరీక్షించాలి
ఏలూరులో సరఫరా అవుతున్న తాగునీటి నమూనాలను ప్రయోగశాలకు పంపించి పూర్తిస్థాయిలో పరీక్షంచాల్సిన అవసరం ఉందని పౌర హక్కుల సంఘం ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. వారు ఏలూరు ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడారు. పలు ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ప్రభుత్వం సక్రమంగా స్పందించలేదనే విమర్శలు కూడా చేశారు. తక్షణమే అసలు కారణాలు కనుగొని, పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రత్యేక వైద్య బృందాలను రంగంలో దింపి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
వైద్య సహాయం విషయంలో జాప్యం లేకుండా చూస్తున్నాం. అదనంగా 250 బెడ్స్ ఏర్పాటు చేశాం. ఎప్పటికిప్పుడు పరిస్థితిని సమీక్షించి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన బీబీసీకి వివరించారు.