అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచి, బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రసారానికి రంగం సిద్ధమైంది. కరోనా, లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా షోను ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ సీజన్ కోసం మొత్తం 20 మంది జాబితాను సిద్ధం చేసుకున్న షో నిర్వాహకులు, 15 మంది పేర్లు ఖాయం చేశారని, మరికొందరు పరిశీలనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఖరారు చేసిన 15 మందిలో ఒకరి కరోనా వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో నాలుగో సీజన్ కోసం హౌస్‌లోకి వెళ్లనున్న కంటెస్టెంట్స్‌లో 'కృష్ణవేణి' సీరియల్ నటుడు సయ్యద్ సోహెల్, 'మహాతల్లి' ఫేమ్ జాహ్మవి, ఆమె భర్త సుశాంత్, జెమినీ టీవీ యాంకర్ ప్రశాంతి, గాయకుడు నోయర్, రఘు మాస్టర్, ఆయన భార్య ప్రణవి, గాయని గీతామాధురి భర్త నందు, 'జబర్దస్త్' ఫేమ్ ముక్కు అవినాష్, నటి కల్యాణి, యాంకర్, 'జోర్దార్' ఫేమ్ సుజాత, 'టిక్ టాక్' స్టార్ మెహబూబా దిల్ సే, దేత్తడి హారిక, కెవ్వు కామెడీ యాంకర్ అరియానా గ్లోరీ, 'టీవీ 9' యాంకర్ దేవిల పేర్లు ఖరారైనట్టు సమాచారం.
వీరితో పాటు హీరోయిన్ పూనమ్ బాజ్వా, వడ్లమాని ప్రియ, యామినీ భాస్కర్, అపూర్వ, అకిల్ సార్థక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిలో చాలామంది క్వారంటైన్‌లో వున్నారు. ఇంతకీ వీరిలో ఎవరు లోపలికి వెళతారో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.