హైదరాబాద్ వానలు: పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
మంగళవారం, 25 జులై 2023 (19:20 IST)
ఏటా పిడుగు పాటు కారణంగా దేశంలో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మూగ జీవాలు చనిపోతున్నాయి. అయితే, పిడుగులు ఎప్పుడు, ఎక్కడ పడతాయో ముందే అంచనా వేయడంతో పాటు, పిడుగుల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ, ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే, పిడుగు అంటే ఏమిటి? అవి ఎలా పుడతాయి? వంటి విషయాలు తెలుసుకోవడం కూడా ముఖ్యం.
పిడుగులు ఎలా పుడతాయి?
ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. అయితే, పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత(+) మేఘాలు పైకి వెళ్తాయి. అధిక బరువుండే రుణావేశిత (ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న) మేఘాలు కిందికి వస్తాయి. అంటే, ఎప్పుడూ మనకు కనిపించే దట్టమైన మబ్బుల్లో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. సైన్స్ ప్రకారం, రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి. అయితే, ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి.
ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. దాన్నే 'పిడుగు పడటం' అంటారని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ విభాగంలో పనిచేస్తున్న నిపుణులు హరి కిరణ్ వివరించారు. మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే సమయంలోనే ఉరుములు, మెరుపులు పుడతాయని ఆయన తెలిపారు.
భూమి మీదే ఎక్కువ
అలా మేఘాల నుంచి పడే 'పిడుగు'లో దాదాపు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది, అది మనిషిని అక్కడిక్కడే కాల్చి బూడిద చేయగలదు. ప్రధానంగా ఎండా కాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దాంతో ఆ ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని నాసా పరిశోధనలో తేలింది. అందులోనూ సముద్రంలో కంటే భూమిపైనే పిడుగులు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి. పిడుగుపాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది.
అందుకోసం అమెరికాకు చెందిన ఎర్త్‌నెట్ వర్క్‌తో పాటు, ఇస్రో సహకారం తీసుకుంటోంది. ఎర్త్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలో సెన్సర్ల ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపి అప్రమత్తం చేస్తున్నారు. దీని ద్వారా 30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించొచ్చని హరి కిరణ్ బీబీసీకి చెప్పారు.
పిడుగుల నుంచి తప్పించుకోవడం ఎలా?
ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదే. కారులో ఉంటే అందులోనే ఉండటం ఉత్తమం. పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి. చెట్ల కిందకు, టవర్ల కిందకు వెళ్లకూడదు. సెల్‌ఫోన్, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకూడదు. ఒకవేళ తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నించాలి. మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. దాంతో ఆ పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మన మీద తక్కువగా పడే అవకాశం ఉంటుంది. భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలి.
ఒకవేళ నీటిలో ఉన్నట్టయితే సాధ్యమైనంత త్వరగా బయటకు వెళ్లాలి. ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి. ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిస్తే బయటకు వెళ్లకుండా పనులను వాయిదా వేసుకోవాలి. ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు స్నానం చేయడం, పాత్రలు కడగటం ఆపేస్తే మంచిది. ఎందుకంటే లోహపు పాత్రలు, పైపుల ద్వారా ఒక్కసారిగా పెద్దమొత్తంలో విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది.
పిడుగు బారిన పడినప్పుడు శరీరంపై రెండు చోట్ల గాయాలవుతాయి. ప్రధానంగా విద్యుత్ ప్రవహించిన చోట, మళ్లీ బయటకు వెళ్లిన చోట(ఎక్కువగా అరికాళ్లపై) గాయాలు అవుతాయి. బాధితులను ముట్టుకుంటే షాక్ తగులుతుందని కొందరు చెబుతుంటారు. కానీ అందులో నిజం లేదు. బాధితులకు వెంటనే ప్రథమ చికిత్స అందించాలి.