మణిపుర్ హింస‌: మహిళలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? -బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

సోమవారం, 24 జులై 2023 (18:44 IST)
ఈశాన్య భారత రాష్ట్రం మణిపుర్‌లో మహిళలపై హింసకు సంబంధించి కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించిన వీడియో వైరల్ కావడం, దానిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమైన తర్వాత మణిపుర్‌లో ఇతర బాధితులు కూడా తమకు జరిగిన అన్యాయాలపై నోరు విప్పడం మొదలుపెట్టారు.
 
హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు కలచివేయవచ్చు.
మేరీ (పేరు మార్చాం) ఒక కుకీ మహిళ. ఆమెకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు ధైర్యం చాల్లేదు. రెండు నెలలకు పైగా ఆమె ఆ భయంతోనే ఉన్నారు. ఆమె 18 ఏళ్ల కూతుర్ని ఇంటి బయట నుంచి ఎత్తుకెళ్లిపోయిన దుండగులు రాత్రంతా సామూహిక అత్యాచారం చేసి, తీవ్రంగా కొట్టి వారి ఇంటి గుమ్మంలో వదిలివెళ్లిపోయారు. ‘‘ఈ విషయం గురించి బయటకు చెబితే నా కూతుర్ని చంపేస్తామని వారు బెదిరించారు’’ అని బీబీసీతో మేరీ చెప్పారు. మే నెలలో మణిపుర్‌లోని మెయితీ, కుకీ తెగల మధ్య జాతి ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 130 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస శిబిరాలకు తరలించారు.
 
మేరీని నేను రిలీఫ్ క్యాంప్ బయటే కలుసుకున్నా. ఒక మూక ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా నడిపిస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో కనిపించింది. దీనిపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది చూశాక మేరీ కూడా తమకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘ఇప్పుడు ఫిర్యాదు చేయకపోతే, భవిష్యత్తులో నాకు మరో అవకాశం రాదనిపించింది. నా కూతురిపై దాడి చేసినవారిని శిక్షించే ప్రయత్నం కూడా నేను చేయలేదనే బాధ నాకు జీవితాంతం ఉండిపోతుంది’’ అని బీబీసీతో మేరీ చెప్పారు.
 
తన కూతురు ఇప్పుడు తరచుగా ఆత్మహత్య గురించి మాట్లాడుతోందని అయితే, ఆమెకు జీవితంపై భరోసా కల్పిస్తున్నానని మేరీ అన్నారు. తనకు కూడా దారుణ అనుభవం ఎదురైందని 19 ఏళ్ల చిన్ సియాన్‌చింగ్ చెప్పారు. ఇంఫాల్‌లో నర్సింగ్ చదువుతున్నప్పుడు తనతో పాటు తన ఫ్రెండ్‌ కుకీ కమ్యూనిటీకి చెందినవారని అక్కడి వారికి తెలియడంతో హాస్టల్‌లో తమపై దాడి జరిగిందని చిన్ సియాన్‌చింగ్ చెప్పారు. ‘‘మేం దాక్కున్న గది వద్దకు వచ్చిన ఒక మూక తలుపును బాదుతూనే ఉంది. ‘మీ కమ్యూనిటీ పురుషులు మా మహిళలపై అత్యాచారాలు చేశారు. ఇప్పుడు మీకు కూడా మేం అదే గతి పట్టిస్తాం’ అని వారన్నారు’’ అని చిన్ గుర్తు చేసుకున్నారు. వెంటనే చివరిసారిగా తన తల్లితో మాట్లాడాలని భావించి చిన్ ఆమెకు ఫోన్ చేశారు.
 
అయితే, కొన్ని నిమిషాల్లోనే తనను, తన స్నేహితురాలిని ఆ మూక వీధిలోకి లాక్కెళ్లి, స్పృహ తప్పేలా కొట్టారని తెలిపారు. తాము చనిపోయామని భావించి ఆ మూక అక్కడి నుంచి పారిపోయిందని ఆమె అన్నారు. ‘‘తొలుత పోలీసులు కూడా మేం చనిపోయామని అనుకున్నారు. కానీ, నాడి చూసిన తర్వాత మేం బతికే ఉన్నట్లు గుర్తించారు’’ అని చిన్ వివరించారు.
 
గౌరవం, అవమానం
మెయితీ మహిళలపై కుకీ పురుషులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ధ్రువీకరించని వార్తలు చిన్, ఆమె స్నేహితురాలిపై మెయితీ పురుషులు దాడి చేసేందుకు పురికొల్పాయి. జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత అభిప్రాయ భేదాలు చాలా తీవ్రంగా మారాయి. ఒకప్పుడు కలిసి జీవించిన ఇరు వర్గాలు ఇప్పుడు పూర్తిగా విడిపోయాయి. ఇరు వర్గాల గ్రామాల ప్రవేశమార్గాల వద్ద బారికేడ్లు వెలిశాయి. రాత్రివేళల్లో ఘర్షణలు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా నడిపించారనే వీడియో మెయితీ మహిళలు కూడా ఈ నిరసనల్లో ఏకమయ్యేలా చేసింది.
పౌర సమాజంలో మహిళలు శక్తిమంతమైన పాత్రను పోషించే సంప్రదాయం మణిపుర్‌లో చాలా కాలంగా ఉంది. వారిలో ‘మణిపుర్ మదర్స్’ అని పిలిచే మీరా పైబీస్ మహిళల సంఘం కూడా ఒకటి.
 
ఈ సంఘానికి చెందిన మహిళలు మణిపుర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, రాష్ట్ర ప్రభుత్వ, ఆర్మీ చేతుల్లో అధికారాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. కొన్ని గ్రామాలకు ప్రాతినిధ్యం వహించే మీరా పైబీస్ సంఘం నాయకురాలు సినమ్ సుర్నలతా లీమా మాట్లాడుతూ, ఇద్దరు కుకీ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రధాన అనుమానితుడిని గ్రామస్థులే పోలీసులకు పట్టించారని చెప్పారు. తర్వాత, మీరా పైబీస్ సంఘానికి చెందిన స్థానిక సభ్యులంతా గుమిగూడి ప్రధాన నిందితుడి ఇల్లును తగులబెట్టారు. ‘‘పురుషులు పాల్పడే హేయమైన నేరాలను మీరా పైబీస్ సంఘం ఖండింస్తుందని చెప్పే సంకేతమే ఈ దహనం. కొందరు చేసిన చర్యలు మొత్తం మెయితీ కమ్యూనిటీ గౌరవాన్ని తగ్గించలేవు’’ అని లీమా అన్నారు.
 
నిందితుడి భార్యతో పాటు ముగ్గురి పిల్లలను కూడా గ్రామం నుంచి బహిష్కరించారు. కానీ, స్త్రీలను ఉన్నతంగా, శక్తిమంతంగా భావించే సమాజంలో ఆ మూక మహిళల పట్ల ఎందుకు అలా ప్రవర్తించింది? ‘‘మెయితీ మహిళల పట్ల కుకీ పురుషులు చేసిన దానికి ప్రతీకారంగా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు’’ అని లీమా చెప్పారు. మెయితీ మహిళలపై అలాంటి దాడుల జరిగినట్లు ఆమెకు వ్యక్తిగతంగా తెలియదు. కానీ, మెయితీ మహిళలు ఇలాంటి వాటిని అవమానకరంగా భావించి చెప్పుకోరని ఆమె అన్నారు. ఘర్షణలు మొదలైన వెంటనే మణిపుర్ రాష్ట్ర పోలీసులు మాట్లాడుతూ, మెయితీ మహిళలపై హింస జరిగినట్లు తమ వద్దకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు.
 
కానీ, రిపోర్ట్ చేయని దాడులు చాలా ఉన్నాయని మెయితీ కమ్యూనిటీ అధికార ప్రతినిధి అన్నారు. ‘‘తమకు జరిగిన వాటి గురించి బహిరంగంగా మాట్లాడి, పోలీసులకు ఫిర్యాదు చేసి, తమ గౌరవానికి భంగం కలిగించుకోవాలని మా మహిళలు అనుకోరు’’ అని కొకొమి అని పిలిచే మెయితీ సంస్థకు చెందిన ఖురైజమ్ అథౌబా అన్నారు. లైంగిక వేధింపుల అంశం బదులుగా హత్యలు, నిర్వాసితుల సమస్యపై దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారు.
 
న్యాయం
వీడియోలో లైంగిక వేధింపులకు గురైనట్లు కనిపించిన కుకీ మహిళల్లో ఒకరి సోదరుడు, ఈ ఘటనలన్నింటితో తీవ్ర వేదనకు గురవుతున్నారు. మూక ఆయన సోదరిని నగ్నంగా నడిపించడమే కాకుండా ఆయన తండ్రిని, తమ్ముడిని కూడా చంపేసింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో తల్లితో కలిసి ఆయన మరో గ్రామంలో ఉండటంతో వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. వారి బంధువు ఇంటి వద్ద నేను ఆయనను కలిశాను. నేను అడిగిన చాలా ప్రశ్నలకు 23 ఏళ్ల ఆ వ్యక్తి బేలగా చూశారు. పోలీసులు, ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారని అని అడగగా, ‘‘మూకలోని ప్రతీ ఒక్కరిని అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా నా తండ్రిని, తమ్ముడిని చంపిన వారిని వదలిపెట్టకూడదు. ప్రభుత్వం ఇరు వర్గాల పట్ల న్యాయంగా వ్యవహరించాలి’’ అని ఆయన బదులిచ్చారు.
 
ఇరు వర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలపై నమ్మకం తగ్గుతోంది. మహిళల పట్ల హేయంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉరి శిక్ష వేసే ప్రయత్నం కూడా చేస్తామని మణిపుర్ ముఖ్యమంత్రి, మెయితీ వర్గానికి చెందిన ఎన్. బీరేన్ సింగ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో హింసాత్మక ఘర్షణలను అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ, రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్ల గురించి అడిగినప్పుడు, ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ‘‘దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పి, దోషులను శిక్షించడమే నా పని’’ అని సీఎం బదులిచ్చారు.
 
మహిళల వీడియోపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన తర్వాత ప్రధాని మోదీ ఈ అంశంపై పెదవి విప్పారు. ‘‘మణిపుర్ కూతుళ్లకు జరిగిన దాన్ని ఎన్నటికీ క్షమించలేం. దోషులు ఎవరినీ వదిలిపెట్టబోం’’ అని ఆయన అన్నారు. కానీ, మోదీ చేసిన వ్యాఖ్య తన కమ్యూనిటీ మొత్తాన్ని చెడుగా చిత్రీకరించాయని, మే నెల నుంచి జరుగుతున్న హింసను విస్మరించిందని లీమా అభిప్రాయపడ్డారు. ఈ హింస వల్ల 60 వేల మంది నిర్వాసితులుగా మారారు. ‘‘కుకీ మహిళలపై జరిగిన దాడి గురించి ప్రధాని మోదీ స్పందించారు. మరి, మేం అనుభవించిన వాటి సంగతి ఏంటి? మెయితీ మహిళలను భారత పౌరులుగా పరిగణించట్లేదా’’ అని లీమా ప్రశ్నించారు.
 
‘‘ఆ వీడియో బయటకు రాకపోయి ఉంటే మాపై రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు అసలు దృష్టి పెట్టకపోయేవారు’’ అని నర్సింగ్ విద్యార్థి చిన్ సియాన్‌చింగ్‌ సహా బాధితులకు మద్దతుగా నిలిచే ఒక పరిశోధకురాలు గ్రేసీ హావోకిప్ అన్నారు. తమ జీవితాలను పునర్నిర్మించుకునే ప్రయత్నంలో ఉంటూ, తమ చేదు అనుభవాలను ధైర్యంగా పంచుకున్న బాధితులకు ఇది బాసటగా నిలిచిందని ఆమె చెప్పారు. చిన్ కూడా స్థానికంగా మరో నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ‘‘ఏదో ఒక కారణంతోనే దేవుడు నన్ను ప్రాణాలతో ఉంచాడని మా అమ్మ చెప్పింది. కాబట్టి, నేను నా కలలను ఎట్టి పరిస్థితుల్లోనే వదులుకోకూడదని నిర్ణయించుకున్నా’’ అని తన కమ్యూనిటీ మహిళలను ఉద్దేశిస్తూ చిన్ ప్రసంగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు