వరుసగా రెండో ఏడాది ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్న మీరాబాయి చాను
సోమవారం, 6 మార్చి 2023 (11:14 IST)
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డ్‌ను వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గెలుచుకున్నారు. ప్రజలు తమ అభిమాన క్రీడాకారిణికి ఓట్లేసి గెలిపించడంతో ఆమెను ఈ అవార్డు వరించింది. 2021లోనూ ఈ అవార్డు ఆమెనే వరించింది. దీంతో వరుసగా రెండుసార్లు ఈ అవార్డు గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా ఆమె గుర్తింపు పొందారు. ఈశాన్య భారత రాష్ట్రం మణిపుర్‌లో జన్మించిన చాను, వంటచెరకును మోస్తూ బరువులు ఎత్తడానికి అలవాటుపడ్డారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్న ఆమె 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 2022 వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె రజత పతకం సాధించారు.
దిల్లీలో నిర్వహించిన ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించగా, మీరాబాయి చాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ... ఈ అవార్డు రెండోసారి దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తనకు ప్రోత్సాహమిచ్చిన బీబీసీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మహిళలు ఆటలు ఆడలేరని, దాని వల్ల వాళ్ల శరీరంపై ప్రభావం పడుతుందన్న మన ఆలోచన మార్చుకోవాల్సి ఉంటుంది. మనం ఆ భయాన్ని దూరం చేసుకోవాలి అని ఆమె అన్నారు. ఈ అవార్డ్ కోసం షార్ట్‌లిస్ట్ అయిన ఇతర పోటీదారులలో రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మలిక్, బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఉన్నారు.ఈ ఏడాది తొలిసారి ప్రారంభించిన 'బీబీసీ పారా స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్' అవార్డ్‌ను భవీనా పటేల్ గెలుచుకున్నారు. పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అయిన భవీనా 2022 టోక్యో సమ్మర్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్నారు.
పారా టేబుల్ టెన్నిస్‌తో రజతం గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డులకెక్కారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో భవీనా స్వర్ణం గెలుచుకున్నారు. అవార్డు గెలుచుకున్న భవీనా పటేల్ మాట్లాడుతూ..'మహిళలకు, క్రీడాకారులకు సాధికారత కల్పించే దిశగా తీసుకున్న ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. బీబీసీ పారా స్పోర్ట్స్‌పై దృష్టి పెట్టడం, మరింత కలుపుకొని పోయేలా ముందుకుపోవడం అభినందనీయం' అన్నారు. భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ ప్రీతమ్ సివాచ్‌కు 'బీబీసీ లైఫ్ టైం అచీవ్‌మెంట్' అవార్డు దక్కింది. భారతీయ క్రీడారంగానికి, తరువాత తరాలకు స్ఫూర్తినందించినందుకు గాను ఆమెను ఈ అవార్డు వరించింది. ద్రోణాచార్య అవార్డు అందుకున్న తొలి మహిళా హాకీ కోచ్ సివాచ్.
ప్రతిష్ఠాత్మక బీబీసీ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు దక్కిన నేపథ్యంలో సివాచ్ మాట్లాడుతూ.. 'ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన బీబీసీకి ధన్యవాదాలు. గత మూడేళ్లుగా గొప్ప క్రీడాకారిణులకు ఈ అవార్డు ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది నాకు ఈ అవార్డు వచ్చిందని తెలిసి ఆనందంగా ఉంది' అన్నారు.బాక్సర్ నీతూ ఘంఘాస్ బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆమె బాక్సింగ్‌లో రెండుసార్లు యూత్ వరల్డ్ చాంపియన్, కామన్‌వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కూడా సాధించారామె. 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో మినిమమ్ వెయిట్ కేటగిరీలో ఆమె స్వర్ణం సాధించారు.
95 ఏళ్ల భగ్వాని దేవి, 106 ఏళ్ల రాంబాయికి బీబీసీ ప్రత్యేక ట్రోఫీలు దక్కాయి. 2022లో ఫిన్లాండ్‌లో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భగ్వాని దేవి 100 మీటర్ల పరుగు విభాగంలో స్వర్ణం గెలుచుకున్నారు. 35 ఏళ్లు దాటినవారి కోసం నిర్వహించిన ఈ పోటీల్లో భగ్వాని దేవి షాట్‌పట్‌లో కాంస్య పతకం సాధించారు. రాంబాయి వడోదరలో జరిగిన 2022 నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 200, 100 మీటర్ల విభాగాలలో స్వర్ణం సాధించారు. వరుసగా రెండో ఏడాది 'బీబీసీ ఇండియా స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలుచుకోవడంపై బీబీసీ న్యూస్ డిప్యూటీ సీఈఓ, డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం జొనాథన్ మన్రో మీరాబాయి చానుకు అభినందనలు తెలియజేశారు. అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది 'బీబీసీ ఇండియన్ పారా స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కూడా ప్రవేశపెట్టడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.
బీబీసీ న్యూస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ సీనియర్ కంట్రోలర్, బీబీసీ వరల్డ్ సర్వీస్ డైరెక్టర్ లిలియాన్ లాండర్ మాట్లాడుతూ.. ఈ అవార్డులకు నామినేట్ అయిన క్రీడాకారిణులంతా భారత్‌లో క్రీడారంగానికి గణనీయమైన సేవ చేశారని, వారి విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. తమతమ రంగాల్లో ప్రతిభ చూపిన వీరంతా భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తళుకులీనుతున్నారని ఆమె అన్నారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2019లో ప్రారంభించారు. విశ్వ క్రీడా వేదికపై సత్తా చాటిన భారతీయ క్రీడాకారిణుల విజయాలను సెలబ్రేట్ చేయడానికి, తమ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను హైలైట్ చేయడానికి ఈ అవార్డు ప్రవేశపెట్టారు.
ఈ ఏడాది ఈ అవార్డు కోసం నామినేట్ అయిన అయిదుగురు క్రీడాకారిణుల పేర్లు ఫిబ్రవరిలో ప్రకటించారు. పేరొందిన క్రీడా జర్నలిస్ట్‌లు, రచయితలు, క్రీడా నిపుణులు సభ్యులుగా ఉన్న జ్యూరీ ప్యానల్ వీరిని నామినేట్ చేసింది. గతంలో పరుగుల రాణి పీటీ ఉష, లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్ ఈ అవార్డును అందుకున్నారు. వైవిధ్యం, సమభావనకు బీబీసీ కట్టుబడి ఉంటుంది. అందుకే ఈ ఏడాది 'బీబీసీ ఇండియన్ పారా-స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'ను కొత్తగా ప్రవేశపెట్టింది. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు నామినీలుగా ఎంపికైన వారి గురించి తెలుసుకుందాం.
మీరాబాయి చాను
సాయిఖోమ్ మీరాబాయి చాను 2021 టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించారు. ఆ తరువాత 2022లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని, బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైనప్పటి నుంచి మీరాబాయి చాను పట్టు వదలని దీక్షతో పతకం కోసం కృషిచేశారు. 2017 వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా తన సత్తా చాటుకున్నారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మీరాబాయి చాను జన్మించారు. ఆమె తండ్రి టీ దుకాణాన్ని నడిపేవారు. క్రీడా జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆమె ఆర్థికపరమైన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అడ్డంకులన్నింటిని అధిగమించి ఒలింపిక్ ఛాంపియన్‌గా ఎదిగారు. 2021లో మీరాబాయి చాను బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు.
సాక్షి మాలిక్
2016లో రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని పొందిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా సాక్షి మాలిక్ చరిత్ర సృష్టించారు. అందులో ఆమె 58 కేజీ వెయిట్ కేటగిరీలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఒలింపిక్స్‌లో పతకం పొందిన నాలుగవ భారతీయ మహిళ ఈమె. సాక్షికి చిన్నప్పటి నుంచి క్రీడలపై మక్కువ. తన తాత రెజ్లర్ అని తెలుసుకున్న తరువాత ఆమె మరింత స్ఫూర్తిని పొందారు. రియో ఒలింపిక్స్‌లో మెరిసిన తరువాత, సాక్షి కెరీర్ ఒక్కసారిగా కుప్పకూలింది. కానీ, ఏ మాత్రం అధైర్యపడకుండా 2022 బర్మింగ్హమ్ ఒలింపిక్స్‌లో బంగార పతకాన్ని సాధించడం ద్వారా మరోసారి తన బలాన్ని నిరూపించుకున్నారు. అంతకుముందు, కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆమె రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.
వినేశ్ ఫోగట్
రెజ్లింగ్‌లో రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్న తొలి భారతీయ మహిళ వినేశ్ ఫోగట్. కామన్‌వెల్త్, ఏషియన్ గేమ్స్ రెండింట్లో బంగారు పతకాన్ని సాధించిన తొలి భారతీయ రెజ్లర్ కూడా ఈమెనే. కామన్‌వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడు బంగారాలు పతకాలు గెలుచుకుని తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించారు. ఈ మూడు పతకాలు భిన్నమైన వెయిట్ కేటగిరీల్లో వచ్చాయి. 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో 53 కేజీల బరువు విభాగంలో బంగారు పతకం సాధించారు.
వినేశ్ ఫోగట్ మహిళా రెజ్లర్ల కుటుంబం నుంచే వచ్చారు. ఆమె కజిన్లు గీతా, బబితా ఫోగట్‌లు కూడా రెజ్లింగ్‌లో పలు అంతర్జాతీయ పతకాలు సాధించారు.
పీవీ సింధు
పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలను సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, 2021 టోక్యో గేమ్స్‌లో కాంస్య పతకాన్ని పొందారు. 2022లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు సింధు. అంతకుముందు, 2021లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలిగా సింధు రికార్డ్ సృష్టించారు. 2012 సెప్టెంబర్‌లో 17 ఏళ్ల వయసులోనే బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. 2019లో ప్రారంభమైన బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పీవీ సింధు అందుకున్నారు.
నిఖత్ జరీన్
నిఖత్ జరీన్ 2011లో జూనియర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పొందిన తరువాత, 2022లో మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎదిగారు. 2022 బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బాకింగ్స్‌లో ఫైవెయిట్ కేటగిరీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు నిఖత్. ఎప్పుడూ ఉరిమే ఉత్సాహంతో ఉండే నిఖత్ క్రీడల్లోకి వెళితే బావుంటుందని భావించిన ఆమె తండ్రి ఆమెకు బాక్సింగ్‌ను పరిచయం చేశారు. 12 ఏళ్ల వయసులో ఒక పోటీలో నిఖత్ కన్ను మీద బలమైన పిడిగుద్దు పడ్దింది. కన్ను నల్లగా మారింది. అది చూసి ఆమె తల్లి ఆందోళనపడ్డారు. అలాగే, నిఖత్ పెళ్లిపై బంధువుల నుంచి విమర్శలు వచ్చాయి. వీటన్నిటినీ పట్టించుకోకుండా, ఆమె తండ్రి ఆమె కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించారు. ఆ తరువాత నిఖత్ జరీన్ వెనుతిరిగి చూడలేదు.