వరుస పండుగల సమయంలో మీరు మెరవాలి. అందంగా కనిపించాలి. అది సాధ్యం కావాలంటే.. ముందు చర్మసంరక్షణపై దృష్టి సారించాలి. అలాంటి సూచనలు కొన్ని మీకోసం...
సహజ చర్మతత్వం కలవారు... అర చెంచా ముల్తానీ మట్టిలో అరచెంచా పాలపొడి, గులాబీ రేకలు మిశ్రమం, దానిమ్మ రసం చెంచా చొప్పున, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పూతలా వేయాలి. పది నిమిషాలయ్యాక కాచి చల్లార్చిన పాలల్లో దూదిని ముంచి ముఖంపై అద్దినట్లు చేయాలి. మర్దన చేస్తూ పూతను తొలగించుకుంటే సరి. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
WD
జిడ్డు చర్మతత్వం ఉన్నవారైతే..
సెనగపిండి, సోయాపిండి అరచెంచా చొప్పున, పావుచెంచా తులసి ఆకుల పొడి, చిటికెడు పసుపు, రెండు మూడుచెంచాల బత్తాయిరసం తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల తరవాత కడిగిస్తే మార్పు ఉంటుంది. చర్మం తాజాగా మారుతుంది. ఇలా రోజుమార్చిరోజు చేయాలి.
WD
పొడిబారిన చర్మతత్వం కలవారికి..
పెసరపిండి, ఓట్స్‌పొడి, పాలమీగడ, బాదంపొడి అరచెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ పాలతో కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తరువాత తీసేయాలి. మరీ పొడిబారిన చర్మం ఉన్నవారు ఈ మిశ్రమాన్ని వేసుకునే ముందు అరటిపండును తేనెలోముంచి ముఖానికి రాసుకుని రెండు మూడు నిమిషాలు మర్దన చేయాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుని అప్పుడు పూతవేయాలి. చర్మం చాలా మృదువుగా మారుతుంది.
WD
పట్టుకుచ్చులాంటి కురులకు..
హెన్నా పొడి అరకప్పు తీసుకొని అందులో కాసిని కొబ్బరిపాలు, పావుకప్పు ఉసిరిపొడి, రెండుచెంచాల వేపపొడి, అర కప్పు మందార ఆకుల పొడి కలపాలి. మిశ్రమం చిక్కగా చేసుకొని తలకు పట్టించాలి. అరగంటయ్యాక తలస్నానం చేయాలి.
WD
మిలమిలలాడే నయనాల కోసం..
సగం ఇ విటమిన్ మాత్ర తీసుకుని అందులో అరచెంచా పాలమీగడ, రెండుచుక్కల నిమ్మరసం కలిపి కళ్ల చుట్టూ రెండు మూడు నిమిషాలు మర్దన చేయాలి. పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇప్పుడు బంగాళాదుంపను తురిమి లేదా రసం తీసుకోవాలి. తురుము అయితే తేనె పావుచెంచా వేయాలి. లేదంటే చెంచా తేనె చేర్చి కళ్లకు పూతలా వేయాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే నయనాలు చాలా తాజాగా కనిపిస్తాయి.
WD
మెరిసే మెడ మీ సొంతం...
వైటనింగ్ క్రీం లేదా కొద్దిగా పాలమీగడ తీసుకుని అందులో చెంచా తేనె, రెండు టమాటాల రసం కలిపి మెడ భాగానికి మర్దన చేయాలి. పది నిమిషాలయ్యాక కడిగేయాలి. చెంచా పాలపొడి తీసుకుని అందులో అరచెంచా వేరు సెనగపప్పుపొడి, రెండుచెంచాల టమాటాగుజ్జు కలిపి కాసిని పాలతో పూత తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడ భాగానికి పట్టించి పదిహేను నిమిషాలయ్యాక రోజ్‍వాటర్‌లో ముంచిన దూదితో అద్దుతూ మృదువుగా మర్దన చేస్తూ శుభ్రపరచాలి.
WD
అందమైన చేతుల కోసం...
ఈ కాలంలో చేతులు పొడిబారవు కానీ.. నల్లగా మారతాయి. అందుకే శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా ఓట్స్ పొడి తీసుకుని రోజ్‌వాటర్, సగం చెక్క నిమ్మరసం కలిపి పూతలా వేయాలి. ఐదునిమిషాల తరువాత కడిగేసుకోవాలి. దీనివల్ల మృతకణాలు తొలగిపోతాయి. ఇప్పుడు బాదంనూనె, ఆముదాన్ని సగం చొప్పున తీసుకుని చేతులకు మర్దన చేయాలి. పదిహేను నిమిషాలయ్యాక దూదితో తుడిచేయాలి. ఈ పూత ప్రయత్నించండి. సెనగపిండి, పెసరపిండి, బియ్యప్పిండి, సోయాపొడి చెంచా చొప్పున తీసుకొని సగంచెక్క నిమ్మరసం చేర్చి.. టమాటారసం కలిపి చేతులకు పూతలా వేయాలి. పదిహేను నిమిషాలయ్యాక కడిగేస్తే సరి.