సత్యం కేసు: రామలింగరాజు బెయిల్‌ రద్దు చేసిన సుప్రీం

PTI Photo
PTI
సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న సంస్థ వ్యవస్థాపకుడు బి రామలింగరాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సిబిఐ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో సుప్రీం బెయిల్‌ను రద్దు చేస్తూ తీర్పును జారీ చేసింది. దీంతో రామలింగరాజు మరోసారి కటకటాలపాలు కానున్నారు.

రామలింగరాజు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సిబిఐ తన వాదనను వినిపించడంలో విజయవంతమైంది. రామలింగరాజుకు బెయిల్‌ మంజూరు చేస్తే ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సిబిఐ గట్టిగా వాదించింది. ఈ వాదనను విన్న సుప్రీం కోర్టు బి రామలింగరాజు, అతని సోదరుడు బి రామరాజుతో సహ మరో నలుగురికి బెయిల్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.

జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్ వర్మలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆరుగురు నిందితులు నవంబర్‌ 8లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది. జులై 2011 నాటికి ఈ కేసులో విచారణను పూర్తి చేయాలని సత్యం కేసును దర్యాప్తు హైదరాబాద్ ప్రత్యేక కోర్టుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇది భారతదేశ చరిత్రలోనే రూ. 14,000 కోట్ల అతిపెద్ద కార్పోరేట్ కుంభకోణం.

వెబ్దునియా పై చదవండి