కార్డుల ఉపయోగం.. స్వైపింగ్ మెషీన్లతో తలనొప్పి.. సర్వీస్ ఛార్జీల బాదుడు..

బుధవారం, 7 డిశెంబరు 2016 (12:38 IST)
పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా నగదు రహిత వ్యవస్థ దిశగా దేశాన్ని తీసుకెళ్లేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రణాళిక వేసిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దుతో కార్డుల ఉపయోగం పెరగడంతో.. సామాన్యులకు ఇబ్బందులు తప్పేలాలేవు. పెద్దనోట్ల రద్దుతో స్వైపింగ్ మిషన్ల సంఖ్య పెరుగుతున్నా, ఆన్‌లైన్ సర్వర్లపై ఒక్కసారిగా భారం పడుతుంది. దీంతో లావాదేవీలు నత్తనడకన సాగుతున్నాయి. 
 
కొన్నిసార్లు చివరివరకు వెళ్లి పేమెంట్ జరగకపోవడంతో వినియోగదారులకు చికాకులు తప్పట్లేదు. ఇదంతా ఓ ఎత్తైతే.. స్వైపింగ్ మిషన్ల సాయంతో కార్డు ద్వారా చెల్లింపులు చేయాలంటే పెద్ద తలనొప్పిగా ఉంది. కనీసం 250 రూపాయలకు కొనుగోలు చేస్తేనే కార్డు చెల్లింపులు తీసుకుంటామని చెప్పడమే కాక, వాటికి అదనంగా 2 శాతం సర్వీసు చార్జి వసూలు చేస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ చార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా, చాలావరకు దుకాణాల వాళ్లు మాత్రం అదనంగా 2 శాతం ఇస్తేనే కార్డు చెల్లింపు తీసుకుంటామని తెగేసి చెప్తున్నారు. 
 
ఇంతకుముందు స్వైపింగ్ మిషన్లు హ్యాంగ్ కావడంతో పాటు స్లో కావడం వంటి సమస్యలను ఎదుర్కొన్నది లేదని.. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యిందని.. కార్డులను ఒకటికి మూడు నాలుగు సార్లు స్వైప్ చేస్తే తప్ప పని కావట్లేదని వ్యాపారులు అంటున్నారు. వేలు వేలు పెట్టి స్వైపింగ్ మిషీన్లు కొన్నప్పటికీ అవి మొరాయిస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి