ఎనీ టైమ్ మనీ కాదు.. ఎనీ టైం నో క్యాష్: వెంటాడుతున్న నోట్ల రద్దు భూతం

శనివారం, 4 మార్చి 2017 (04:13 IST)
ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అనాలోచితంగా, మూర్ఖంగా, మొండిగా చేపట్టిన పెద్దనోట్ల రద్దు ప్రభావం మూడునెలల తర్వాత కూడా దేశప్రజలను భూతంలా వెంటాడుతూనే ఉందా? నగదు కొరత మళ్లీ మొదలైందా.. నోట్ల రద్దుతో 3 నెలల కిందట నెలకొన్న పరిణామాలు మళ్లీ పునరావృతమవుతున్నాయా.. ప్రస్తుతం ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులు, బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడాన్ని చూస్తుంటే నిజమేననిపిస్తోంది.

గత ఐదు రోజులుగా ఏటీఎంలు కేవలం బ్యాలెన్స్‌ విచారణకే పరిమితమయ్యాయి. బ్యాంకర్లు వాటిలో నగదును నిల్వ చేయకపోవడంతో వేతనజీవులు, జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల ప్రారంభం కావడంతో సాధారణంగా నగదు ఉపసంహరణకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. కానీ బ్యాంకర్లు ఏటీఎం మిషన్లలో నగదును అందుబాటులో ఉంచకపోవడం, కనీసం బ్యాంకుకు అనుసంధానంగా ఉన్న ఏటీఎంల్లో కూడా కరెన్సీ లభించకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
గతేడాది నవంబర్‌లో కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రోజుల కంటే ఇప్పుడే నగదు సమస్య తీవ్రంగా ఉందని బ్యాంకర్లు ప్రైవేట్‌ సంభాషణల్లో చెబుతున్నారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో 80 శాతం కొత్త కరెన్సీ వచ్చినా.. అది తిరిగి బ్యాంకులకు రాకపోవడం, ఆర్‌బీఐ నుంచి నగదు అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్యాంకర్లు చెపుతున్నారు. నాలుగు అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంక్‌ బ్రాంచీలను సందర్శించిన మీడియా ప్రతినిధులకు అన్నిచోట్ల నగదు కొరత ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. గడచిన వారం దాకా రూ.50 వేల దాకా ఇచ్చిన బ్యాంకులు.. ఈ వారం ప్రారంభం నుంచి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
మామూలుగా బ్యాంక్‌ల్లో నగదు విత్‌డ్రా చేసేవారు ఎంతమంది ఉంటారో అంతకు మించిన సంఖ్యలో డిపాజిట్‌దారులు ఉంటారు. కానీ ఇప్పుడు విచిత్రంగా బ్యాంక్‌ల్లో డిపాజిట్‌ చేయడానికి వచ్చేవారి కోసం సిబ్బంది ఎదురుచూస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆంధ్రాబ్యాంక్‌ శాఖలో నగదు కోసం వచ్చిన వారికి రూ.10 వేలు ఇచ్చి పంపుతున్నారు. మొన్నటిదాకా రూ.50 వేలు ఇచ్చి ఇప్పుడు.. అత్యవసరంగా డబ్బు కావాలంటే ఎందుకివ్వడం లేదని ఖాతాదారులు సిబ్బందితో గొడవ పడుతున్నారు. ఈ నెల 13 నుంచి నగదు ఉపసంహరణ పరిమితి ఎత్తివేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. అయితే అందుకు పది రోజుల ముందు నుంచే నగదు సమస్య మొదలుకావడం బ్యాంకర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ‘‘నోట్ల రద్దు సమయంలో కూడా మేం ఇన్ని ఇబ్బందులు పడలేదు. అంతెందుకు కిందటివారం కూడా ఖాతాదారులకు రూ.50 వేల చొప్పున ఇచ్చాం. ఇప్పుడు అకస్మాత్తుగా సమస్య వచ్చిపడింది. దానికి తోడు డిపాజిట్లు చేసే వారు లేరు’’అని మలక్‌పేటలో స్టేట్‌బ్యాంక్‌ అధికారి ఒకరు అన్నారు.
 
వ్యాపారులు, వాణిజ్య సంస్థలు నగదు రహిత లావాదేవీలు సాగిస్తుండడం, అందుబాటులో ఉన్న కొద్దిపాటి నగదును తమ వద్దే నిల్వచేసుకోవడంతో బ్యాంకుల్లో రోజువారీ డిపాజిట్లపై తీవ్ర ప్రభావం పడిందని బ్యాంకర్లు చెబుతున్నారు. హైదరాబాద్ మణికొండలోని ఎస్‌బీఐ బ్రాంచీలో రోజుకు సగటున రూ.90 లక్షల సొమ్ము డిపాజిట్‌ అయ్యేది. ఇప్పుడు సగటున రూ.20 లక్షలు కూడా రావడం లేదు. అయితే నగదు ఉపసంహరణ మాత్రం రోజూ రూ.కోటికి పెరిగింది. దీంతో నగదు కొరతను భర్తీ చేసేందుకు ప్రధాన బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోందని, ఏటీఎంలో నగదును అందుబాటులో పెట్టడం లేదని మేనేజర్‌ తెలిపారు. దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు తగ్గడంతో సొంత ఖాతాదారులకు మాత్రమే ఎంతో కొంత నగదు పంపిణీ చేసేలా బ్యాంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం జంటనగరాల్లో దాదాపు 95 శాతం ఏటీఎంలు నోక్యాష్‌ బోర్డులతో దర్శనమిచ్చాయి.
 
నగదు ఉపసంహరణపై బ్యాంకులు భారీగా చార్జీల వసూళ్లకు తెరలేపాయి. మార్చి1 నుంచి నాలుగు లావాదేవీల తర్వాత ప్రతి లావాదేవీపై అదనపు చార్జీల పేరిట రూ.150 వరకు చెల్లించాల్సి వస్తుందని ప్రకటించాయి. ఈ అదనపు వసూళ్ల నిర్ణయం ఖాతాదారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ఖాతాదారులు తమ అకౌంట్లో ఉన్న నగదు నిల్వను ఫిబ్రవరి చివరి వారంలోనే బ్యాంకుకు వెళ్లి ఒకే దఫాలో ఉపసంహరించుకున్నారు. వారంలో రూ.50 వేల లోపు నగదు ఉపసంహరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫిబ్రవరి 13 నుంచి 28 మధ్య భారీగా నగదు ఉపసంహరణ జరిగిందని రిజర్వ్‌ బ్యాంక్‌ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో మార్చి మొదటివారంలో నగదుకు ఇబ్బంది ఏర్పడిందని, సరిగ్గా వేతనాల సమయంలో ఉద్యోగులు సమస్యల్లో పడ్డారని అంటున్నారు.
 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరెన్సీ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో కొన్ని ఏటీఎంలే పనిచేశాయి. అదీ నగదు లోడు చేసిన గంట లేదా రెండు గంటల్లోనే నిండుకుంటున్నాయి. వికారాబాద్‌లో శుక్రవారం 12 ఏటీఎంలకుగాను నాలుగు మాత్రమే పనిచేశాయి. సాయంత్రానికి వాటిలో కూడా డబ్బు అయిపోయింది. తాండూరులో ఖాతాదారులు ఏటీఎంల ముందు బారులు తీరారు. నల్లగొండ జిల్లా దేవరకొండ, హాలియా ప్రాంతాల్లో గడచిన వారం రోజులుగా బ్యాంక్‌లు నగదు సరఫరా చేయడం లేదు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఇదే పరిస్థితి. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో బ్యాంక్‌లు ఖాతాదారులకు రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదు.
 
ఖాతాదారులనుంచి, ప్రజల నుంచి కష్టార్జితాన్ని కొల్లగొట్టడమే పరమావధిగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, దాని తైనాతీ బ్యాంకులు ప్రజలకు సేవ చేయడాన్ని పక్కనబెట్టి ప్రజలను ఎన్నిరకాలుగా చిత్రహింసలు పెట్టాలో అన్నిరకాలుగా గత మూడునెలలుగా దేశాన్ని అవాంఛిత చిత్రహింసల కొలిమిగా మార్చిపడేశాయి. ఇప్పుడు పరిమితికి మించి లావాదేవీలను  జరిపితే ఒక్కో లావాదేవీకి రూ. 150లను బ్యాంకులు చెప్పాపెట్టకుండానే 
ఖాతానుంచి లాగేసుకోవటం ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా ఖాతాల్లోని డబ్బులను ప్రజలు లాగేసుకున్నారు. దీంతో పరిస్ధితి మళ్లీ మొదటికి వచ్చింది.
 

వెబ్దునియా పై చదవండి