ఆన్‌లైన్‌ బదిలీలో నగదు మరో ఖాతాలోకి వెళ్తే ఏం చేయాలి?

గురువారం, 7 సెప్టెంబరు 2017 (15:06 IST)
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ నగదు లావాదేవీలవైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. నగదును మరో ఖాతాలోకి బదిలీ చేసేందుకు, ఇతర యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు కూడా ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారు. ఇలా ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేసే సమయంలో ఒక ఖాతాలోకి బదిలీ చేయాల్సిన మొత్తం మరో ఖాతాలోకి వెళితే ఏం చేయాలో తెసుకుందాం. 
 
పొరపాటున ఒక ఖాతాలోకి వెళ్లాల్సిన డ‌బ్బు వేరే ఖాతాలోకి బదిలీ అయినట్టు గ‌మ‌నిస్తే, వెంటనే సంబంధిత బ్యాంకును సంప్ర‌దించి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఖాతా నంబరును త‌ప్పుగా నమోదు చేయ‌డం వ‌ల్ల ఆ అకౌంట్‌కు డబ్బులు బదిలీ అయిన‌ట్లు బ్యాంకు వారికి వివ‌రిస్తూ ఓ ఫిర్యాదు లేఖ కూడా ఇవ్వాల్సి ఉంది. 
 
అప్పుడు ఆ ఖాతాదారుడిని బ్యాంకు వాళ్లు సంప్ర‌దించి జరిగిన త‌ప్పిదాన్ని వివ‌రించి.. పొర‌పాటుగా బదిలీ అయిన మొత్తాన్ని వెనక్కి (రివ‌ర్ట్) చేసేందుకు అనుమ‌తి కోర‌తారు. ఆ ఖాతాదారు ఒప్పుకుంటే తక్షణం బదిలీ చేయవచ్చు. అలాకానీ పక్షంలో బ్యాంకు సిబ్బంది కూడా చేతులెత్తేస్తారు. అప్పుడు కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఖాతాదారుడు కూడా నగదు పొర‌పాటుగా మరోఖాతాలోకి జ‌మ అయిన‌ట్లు కోర్టులో నిరూపించుకోగ‌ల‌గాలి. 
 
అలాగే, సదరు ఖాతాదారుడు కూడా డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఎవ‌రు పంపించార‌నే వివ‌రాలు కోర్టుకు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. లేకపోతే  డబ్బు మొత్తం వెనక్కి ఇవ్వ‌డ‌మే కాదు.. కోర్టు దండనకు కూడా గురికావాల్సి ఉంటుంది. 
 
మరోవైపు ఒక‌వేళ డ‌బ్బులు పంపించిన ఖాతా నెంబ‌ర్ మిస్సయి అకౌంట్ నెంబ‌ర్ లేని దాంట్లోకి బదిలీ చేసినా, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లో త‌ప్పుగా ఎంట‌ర్ చేసినా.. లావాదేవీ ఫెయిల్ అవుతుంది. దీంతో డబ్బులు మ‌ళ్లీ అదే అకౌంట్‌లోకి జ‌మ అవుతాయి. కాక‌పోతే డ‌బ్బులు జ‌మ అవ‌డానికి కొంచెం స‌మ‌యం ప‌డుతుంది. 

వెబ్దునియా పై చదవండి