వృద్ధురాలిని కిందపడేసిన సిబ్బంది... సారీ చెప్పిన ఇండిగో

సోమవారం, 13 నవంబరు 2017 (12:57 IST)
దేశంలో ఉన్న ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతిష్ట మరోమారు మంటగలిసింది. ఇటీవల బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో ముంబై ఎయిర్‌పోర్టులో ఆ సంస్థ గ్రౌండ్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడిని కిందపడేసి పిడిగుద్దులు కురిపించారు. ఈ రెండు ఘటనలతో ఆ సంస్థపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పైగా ఆ ఘటనలు మరిచిపోకముందే మరో సంఘటన జరిగింది. 
 
ఓ వృద్ధురాలిని వీల్‌చైర్ నుంచి తీసుకెళుతూ కిందపడేశారు. ఆ తర్వాత ఆమె సారీ చెప్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే, లక్నో విమానాశ్రయంలో ఊర్వశి పారిఖ్ విరేన్ అనే ప్రయాణికురాలిని వీల్‌‌చైర్లో ఇండిగో సిబ్బంది అరైవల్ హాల్‌కు తీసుకెళ్తుండగా ఆమె కిందపడిపోయారు. దీనిపై క్షమాపణలు చెబుతూ ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటన విడుదల చేసింది.
 
ఆ ప్రకటనలో "నిన్నరాత్రి 8 గంటలకు లక్నో విమానాశ్రయంలో జరిగిన ఈ దుర్ఘటనపై ఊర్వశి పారిఖ్‌కు క్షమాపణ తెలుపుతున్నాం. మా ప్రతినిధి ఒకరు అమె వీల్‌చైర్‌ను వెహికిల్ లేన్ మీదుగా అరైవల్ హాల్ వైపు నెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రాత్రిపూట కావడంతో అక్కడ వెలుతురు సరిగా లేకపోవడానికి తోడు అదే ప్రాంతంలోని తారురోడ్డుపై గుంతపడటం వల్ల వీల్‌‌చైర్ బ్యాలెన్స్ తప్పిపోయింది. దీంతో ఆమె కిందపడి గాయపడ్డారు. మా సిబ్బంది వెంటనే ఆమెను ఎయిర్‌ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైద్యుడి వద్దకు తీసుకెళ్లి వైద్యం అందించారు. ప్రథమ చికిత్స చేసిన తరువాత ఆమె కోలుకున్నారు" అంటూ ఇండిగో తెలిపింది. 
 
ఈ ఘటనలో మానవ తప్పిదంలేదని ఆమె తెలిపారని ఇండిగో పేర్కొంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని ఇండిగో సంస్థ స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఇండిగో సిబ్బంది తీరుతో ఆ సంస్థ పేరు ప్రతిష్టలు మసకబారుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు