టాటా సన్స్ ఛైర్మన్ రేసులో తెలుగోడు పేరు తెరపైకి వచ్చింది. ఈయన రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. ఆయన పేరు ఎస్.రామదురై. ప్రస్తుతం కేబినెట్ మంత్రి హోదాతో నేషనల్ స్కిల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈయన హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేయడం మార్కెట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
టీసీఎస్ సీఈఓగా, వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన సుబ్రమణియన్ రామదురైని రతన్‌టాటాకు సన్నిహితుల్లో ఒకరిగా చెబుతారు. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఛైర్మన్ పదవితో పాటు నేషనల్ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సారధ్య బాధ్యతలకు కూడా రామదురై రాజీనామా చేశారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సెప్టెంబరు ఆఖరువారంలో ఆరోగ్య కారణాలను పేర్కొంటూ జంట పదవులకు రామదురై రాజీనామా చేశారని, ప్రధాని కార్యాలయం రాజీనామాలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని తెలిసింది.
తమిళనాడులో స్థిరపడిన తెలుగుకుటుంబాలకు చెందిన రామదురై 1945లో నాగ్‌పూర్‌లో జన్మించారు. ఆయన తండ్రిగారు తమిళనాడు అకౌంటెంట్ జనరల్‌గా పనిచేశారు. రామదురై సమర్ధతపై రతన్‌టాటాకు చాలా విశ్వాసం. సుదీర్ఘకాలం పాటు టాటా గ్రూప్‌తో ఉండటం వల్ల సంస్థ పనిసంస్కృతి, సంప్రదాయాల గురించి కూడా ఆయనకు పూర్తి అవగాహన ఉంది.