వికలాంగులకు రుణ సహాయ పథకాలు

వికలాంగులు ఆర్థిక స్వావలంబన సాధించేందుకై పలు పథకాలను జాతీయ వికలాంగ ఫైనాన్స్ డెవ్‌లెప్‌మెంట్ కార్పొరేషన్ అమలు చేస్తోంది. వారు తమ కార్యకలాపాల్లో విజయం సాధించేందుకు కూడా తగిన రీతిలో సాయం అందిస్తోంది.

ఉద్యోగాలకోసం వెతకడం కాకుండా తామే నలుగురికి ఉద్యోగాలిచ్చే స్థాయికి వారిని తయారు చేయాలనే దిశగా ఈ సంస్థ కృషి చేస్తోంది. చిన్న చిన్న దుకాణాలు, వాణిజ్య సంస్థలకు, వాహనాల కొనుగోలుకు, పరిశ్రమల స్థాపనకు వ్యవసాయాధాత పరిశ్రమలకు కూడా రుణసాయం అందిస్తోంది.

చిన్న దుకాణం, వ్యాపార సంస్థలు ప్రారంభించేందుకై గరిష్ఠంగా రూ. లక్ష వరకు, సేవా సంస్థల ప్రారంభానికి రూ. 3లక్షల వరకు రుణాసాయం అందిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు రూ. 5లక్షల వరకు రుణ సాయం అందించగలదు.

అలాగే సరకు వాహనాలు, అద్దె కార్లు, టాక్సీ, ఆటోల కొనుగోలుకు సైతం రూ. 5లక్షల వరకు రుణ సాయం అందిస్తామని తెలిపింది. స్వయం ఉపాధి పథకాలకు రూ. 3లక్షల వరకు రుణ సాయం అందిస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారి కుటుంబీకులకు సైతం ఈ పథకాలను విస్తరిస్తున్నారు.

స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదివే వికలాంగులకు మాత్రమే విద్యా రుణాలు అందిస్తోంది. ట్యూషన్ ఫీజు, నెల వారీ ఫీజు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ రుణం అందిస్తోంది.

భారత పౌరుడిగా 40శాతానికి పైగా అంగవైకల్యం కలిగిన వారు, పెద్దలు, సంరక్షకుల రాబడి అంతంత మాత్రంగానే కలిగిన వారు, అర్హత పరీక్షల్లో కనీసం రెండో తరగతి మార్కులతో(50శాతం) ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ రుణాలకు అర్హులు.

అలాగే చిన్న స్థాయి పరిశ్రమలకు రూ. 5లక్షల వరకు రుణ సాయం అందిస్తోంది. సంస్థ యజమాని లేక ప్రధాన నిర్వాహకుడు వికలాంగుడిగా ఉండటమే కాక అక్కడ పనిచేసే సిబ్బందిలో కనీసం 15శాతం మంది అయినా వికలాంగులు ఉండాలని నిబంధన ఉంది.

ఈ పథకాలకు రాష్ట్ర రాజధానుల్లోని ఆ సంస్థ కార్యాలయాలను కానీ, బ్యాంకులను కానీ సంప్రదించవచ్చు. రుణాల కోసం కాళ్లరిగేలా బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నామంటున్న వికలాంగులు ఓ సారి ఈ సంస్థ ద్వారా ప్రయత్నించి చూడొచ్చు.

వెబ్దునియా పై చదవండి