* భోజనం ఓ పట్టాన చేయని పిల్లలు వయసు తగిన బరువు లేక పీలగా, బక్కగా తయారవుతుంటారు. ఇలాంటి పిల్లల కోసం.. భోజనం, స్నాక్స్ రోజూ మూడుసార్లు ఉండేలా చూడాలి. అదే సమయంలో ఆ ఆహారం వారికి నచ్చేదిగా, సులువుగా, నిమిషాల్లో తినగలిగేదిగా ఉండాలి. కోడిగుడ్ల టోస్ట్, పండ్లతో చేసిన మిల్క్‌షేక్‌లు బక్క పిల్లలకు మంచి స్నాక్స్‌గా ఉపయోగపడతాయి.
* జావ ఇస్తున్నప్పుడు దానిపై పండ్ల ముక్కలు, ఎండుద్రాక్ష ఎక్కువ మోతాదులో వేసి పిల్లలకు ఇవ్వాలి. పీనట్ బటర్ లేదా వేయించిన వేరుశెనగపప్పు పిల్లలకు మంచి శక్తినిస్తుంది. పెరుగు లేదా పాలు, అన్నంతో కలిపి తయారు చేసే ఫుడ్డింగ్‌లు కూడా మేలు చేస్తాయి. కోడిగుడ్డుతో చేసిన పదార్థాలు పొద్దున్నే అల్ఫాహారంగా ఇస్తే పిల్లలకు మాంసకృత్తులతోపాటు, శక్తి కూడా లభిస్తుంది.
* ఉడికించిన బంగాళాదుంపను నేరుగా కాకుండా, ముద్దలా చేసి పాలు, ఛీజ్ కలిపి పెట్టాలి. మొక్కజొన్న గింజలు, ఛీజ్ కలిపి చేసిన ఏ వంటకమైన పీలగా ఉండే పిల్లలకు మంచి ఆహారం అవుతుంది. భోజనం తరువాత పాలతో చేసిన ఫుడ్డింగ్ లేదా పండ్లతో చేసిన కస్టర్డ్, అరటిపండుతో చేసే ఇన్‌స్టంట్ ఫుడ్డింగ్ పెట్టడం తప్పనిసరి. ఇలాంటివన్నీ చేస్తే బక్కగా ఉండే పిల్లలు క్రమంగా లావవుతారు.