* పిల్లల ఎదుగుదలలో ఆటలకున్న ప్రాముఖ్యాన్ని ఈతరం తల్లిదండ్రులు అంతగా గుర్తించటం లేదు. ఇతర పిల్లలతో కలవనీయక పోవటం, ఆడుకోనీయక పోవటం నేడు సర్వ సాధారణం. ఆటలు శరీరానికే కాదు.. అవి మానసికంగా కూడా ఎంతో మేలు చేస్తాయి. వ్యక్తిగా ఎదిగేందుకు దోహద పడతాయి.
* గెలుపు, ఓటములను అంగీకరించేందుకు, పోరాట పటిమను తెచ్చుకునేందుకు, నలుగురితోనూ కలిసేందుకు ఆటలు ఎంతగానో తోడ్పడతాయి. నేర్చుకొనే సామర్ధ్యం పెరగటానికి, శారీరకంగా ఎదగటానికి కూడా ఈ ఆటలు తోడ్పతాయి. ఆటల వల్ల పిల్లల్లో జ్ఞానం, అనుభవం పెంపొందుతాయి. వారిలో జిజ్ఞాస పెరిగి, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.
* ఏదో చేయాలని ప్రయత్నిస్తూ.. ఫలితాలను పోల్చుకుంటూ.. ప్రశ్నలు అడుగుతూ.. సవాళ్లని నెరవేరుస్తూ పిల్లలు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆటల వల్ల పిల్లల్లో భాషా ప్రావీణ్యం పెరుగుతుంది. ఆలోచించటం, ప్రణాళిక వేయటం, కార్యనిర్వహణ, నిర్ణయాలు తీసుకొనే శక్తి పెంపొందుతుంది. అయితే.. అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా ఆడుకోవటానికి కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి సమాన అవకాశాలు కల్పిచాలి.