వేసవిలో పిల్లలు టీవీలకు అతుక్కుపోతున్నారా? ఐతే జాగ్రత్త.. ఈ టిప్స్ పాటించండి

గురువారం, 27 ఏప్రియల్ 2017 (12:26 IST)
వేసవి సెలవుల్లో పిల్లలు ఎండలకు బయట తిరగకూడదని తల్లిదండ్రులను వారిని ఇంటికే పరిమితం చేస్తుంటారు. దీంతో వారు టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్స్, ఐపాడ్‌ను ఉపయోగించేందుకు అలవాటపడతారు. కానీ పిల్లలు వీటికి అలవాటు పడితే కంటికి అలసట తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల కళ్లు అలసిపోవడం ద్వారా మెడ, తలనొప్పి వంటి సమస్యలు వేధిస్తాయి. 
 
అందుకే కంప్యూటర్లకు అతుక్కుపోయే పిల్లల పట్ల తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు టీవీ, కంప్యూటర్‌ లేదా ఇతర డిజిటల్‌ వస్తువుల మీద అస్సలు సమయాన్ని వెచ్చించకూడదు. రెండు సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న పిల్లలు రోజుకి రెండు గంటలకి మించి వీటి మీద సమయం గడపకుండా చూసుకోవాలి.
 
కంప్యూటర్‌ స్క్రీన్‌కి కళ్లకు మధ్య 35 అంగుళాల దూరం ఉంటే కంటికి అలసట తప్పుతుంది. ఇంకా పిల్లలు కంప్యూటర్‌ మీద పనిచేస్తూ మధ్య మధ్యలో పుస్తకాలని రిఫర్‌ చేస్తోంటే పుస్తకాలను కూడా మానిటర్‌ అంత దూరంలోనే ఉంచండి. దాంతో తరచూ కండ్ల ఫోకస్‌ సరిచూసుకోవాల్సిన అవసరం తగ్గి కంటి అలసట కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే సాయంత్రం పూట పార్కులకు వెళ్లడం చేయాలి. స్వచ్ఛమైన గాలిని పీల్చాలి. పిల్లల్లో కంటి అలసట తగ్గాలంటే.. పచ్చదనాన్ని కంటి నిండా చూడాలి. 
 
మీ పిల్లలు కనీసం రోజులో అరగంటైనా హాయిగా కండ్లు మూసుకుని విశ్రమించేటట్లు చూడండి. అలా కండ్లు మూసుకున్నప్పుడు కండ్ల మీద చక్రాల్లా తరిగిన కీరా దోసకాయలు, లేదా రోజ్‌ వాటర్‌లో ముంచిన దూది లేదా వాడేసిన తరువాత ఫ్రీజర్‌లో ఓ నాలుగైదు గంటలు ఉంచిన టీ బ్యాగ్‌లని ఉంచండి. కండ్ల అలసట తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కంప్యూటర్లు చూస్తుంటే వెలుతురు ఎలా వుందో చూసుకోవాలి. 
 
గదిలో సరైన వెలుతురు లేకపోవడం వల్ల కంటి కండరాలు అలసటకి గురవుతాయి. పిల్లలు చదువుకునే గదిలో వెలుతురు ధారాళంగా ప్రసరించేటట్లు చూడంది. కంప్యూటర్‌ ఉపయోగించేటప్పుడు అలసట తగ్గాలంటే కంప్యూటర్‌ నుండి వెలువడే కాంతి పరావర్తనం చెంది వారి కంటిలో పడకుండా చూడండి. ఇంకా ప్రతీ 20 నిమిషాలకొకసారి కంప్యూటర్‌ తెర నుండి బయటకి చూసి కావాలని కండ్లు టపటపలాడించమని పిల్లలకు చెప్పాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి