కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పిడుగులాంటి వార్తను ఒకటి చెప్పింది. కరోనా వైరస్ గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు తెలిపింది. ముఖ్యంగా, కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తోందన్నారు.
కరోనా వైరస్‌తో కూడిన నీటి తుంపర్లను లేదా గాలి తుంపర్లను పీల్చిన వారికి వైరస్ సోకుతోందని తెలిపింది. అంతేకాదు, ఆ తుంపర్లు కళ్లలో, నోటిలో లేదా ముక్కులో పడిన వారికి కూడా వైరస్ సోకుతుందని చెప్పింది.
గాలి, వెలుతురు లేని ప్రదేశాల్లో ఉండేవారికి కూడా వైరస్ సోకే అవకాశాలు ఉంటాయని తెలిపింది. వెలుతురు, గాలి ప్రసరించని గదుల్లో ఎక్కువ మంది ఎక్కువ సేపు గడిపితే ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉంటాయని వెల్లడించింది. గాలి తుంపర్లు ఒకే చోట స్థిరంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ సోకుతుందని తెలిపింది.