కరోనా వైరస్ వికటాట్టహాసం : ఒక్కరోజే 3,689 మంది మృతి

ఆదివారం, 2 మే 2021 (12:29 IST)
దేశంలో కరోనా రక్కసి వికటాట్టహాసం చేస్తోంది. ప్రమాదకరస్థాయిలో విరుచుకుపడుతూనే ఉంది. నిత్యం వేల మందిని బలితీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3600 మందికి పైగా వైరస్‌తో మృత్యువాత పడ్డారు. ఇక రోజువారీ కేసులు అంతక్రితం రోజుతో పోలిస్తే కాస్త తగ్గడం గమనార్హం. 
 
తాజాగా దేశంలో 3.92 లక్షల మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. 
శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల మధ్య దేశవ్యాప్తంగా 18 లక్షల మంది కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 3,92,488 మందికి పాజిటివ్‌గా తేలింది. 
 
అంతక్రితం 24 గంటల్లో 4లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. నిన్న కాస్త తగ్గాయి. అయితే పరీక్షలు తగ్గడంతోనే కేసుల సంఖ్య పడిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1.95కోట్లకు చేరింది.
 
ఇదేసమయంలో రికవరీలు కాస్త ఊరటనిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 3,07,865 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 1.59కోట్లకు చేరింది. 
 
రికవరీ రేటు 81.77శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33,39,644 క్రియాశీల కేసులుండగా.. యాక్టివ్‌ కేసుల రేటు 17.13శాతానికి పెరగడం కలవరపెడుతోంది.
 
గడిచిన 24 గంటల్లో మరో 3,689 మంది వైరస్‌కు బలయ్యారు. దేశంలోకి మహమ్మారి ప్రవేశించిన తర్వాత ఒక రోజులో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
అత్యధికంగా మహారాష్ట్రలో  802 మంది మరణించారు. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటకల్లోనూ మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు 2,15,542 మంది కొవిడ్‌తో మృత్యుఒడికి చేరుకున్నారు. మరణాలు రేటు 1.10శాతంగా ఉంది.
 
 
ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శనివారం కాస్త నెమ్మదించింది. నిన్న కేవలం 18.26లక్షల మందికే టీకాలు ఇచ్చారు. వ్యాక్సిన్ల కొరత కారణంగా చాలా చోట్ల పంపిణీ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. 
 
మే 1 నుంచి 18 ఏళ్లు దాటినవారందరికీ టీకాలు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ కేవలం 6 రాష్ట్రాలే ఆ ప్రక్రియ ప్రారంభించాయి. మిగతా రాష్ట్రాల్లో ఈ పంపిణీ ఆలస్యమవనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు