భారత్‌లో కరోనా విశ్వరూపం ఖాయం - జూలై నెలాఖరుకు లక్షల సంఖ్యలో

మంగళవారం, 16 జూన్ 2020 (16:56 IST)
భారత్‌లో కరోనా విశ్వరూపం దాల్చడం ఖాయంగా తెలుస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీందో జూలై నెలాఖరు నాటికి లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఖాయమని మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. 
 
నిజానికి లాక్డౌన్ సమయంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెద్దగా ప్రభావం లేదు. కానీ, ఆ తర్వా దశలవారీగా లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూ వచ్చారు. దీంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. 
 
ఇదిలావుంచితే, ప్రపంచ కరోనా పరిస్థితులపై అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. జూలై 15 నాటికి భారత్‌లో కరోనా తీవ్రస్థాయికి చేరుతుందని, అప్పటికి 8 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు.  
 
అప్పటికి కరోనా కేసుల జాబితాలో బ్రెజిల్ తర్వాత స్థానం భారత్‌దే అవుతుందని అంచనా వేసింది. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కంటైన్మెంట్ నియమనిబంధనలు సడలించడం వల్ల భారతదేశంలో కరోనా రెక్కలు విప్పుకుని వ్యాపిస్తుందని తెలిపారు.
 
భారత్‌లో కరోనా విజృంభణ పతాక స్థాయికి చేరడానికి మాత్రం మరికొంత సమయం పడుతుందని మిచిగాన్ యూనివర్సిటీలో బయోస్టాటిస్టిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భ్రమర్ ముఖర్జీ పేర్కొన్నారు. 
 
కాగా, ప్రస్తుతం భారత్‌లో 3.43 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 21 లక్షల కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 8 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. కరోనా దేశాల జాబితాలో భారత్ తాజాగా నాలుగోస్థానానికి ఎగబాకింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు