కరోనా పేషెంట్ చివరి క్షణాల్లో తీసిన వీడియో వైరల్ అవుతోంది. జ్వరం, శ్వాస ఇబ్బందులతో రవి కుమార్ (34) అనే వ్యక్తి జూన్ 24న హైదరాబాద్, ఎర్రగడ్డలోని గవర్నమెంట్ జనరల్ అండ్ చెస్ట్ హాస్పిటల్‌లో చేరారు. కానీ, రెండు రోజులు తిరక్కుండానే జూన్ 26న మరణించారు. ఇతను కరోనా చివరి క్షణాల్లో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చనిపోయేంతవరకు అతనికి కరోనా ఉన్నట్లు ఎవరికీ తెలియదు.
ఈనెల 23న జ్వరం, శ్వాస ఇబ్బందులు తలెత్తడంతో రవికుమార్ తండ్రి వెంకటేశ్వర్లు ఆయన్ను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, జ్వరం ఉండటంతో కరోనా కావచ్చని, టెస్టు చేసుకుని వస్తేనే చేర్చుకుంటామని ఆ ఆసుపత్రి వాళ్లు తేల్చి చెప్పారని రవికుమార్ తండ్రి వాపోయారు. అక్కడి నుంచి తాను పదికిపైగా ఆసుపత్రులకు వెళ్లానని, ఎవరూ తన కొడుకును ఆసుపత్రి గేటు కూడా దాటనివ్వలేదని వెంకటేశ్వర్లు తెలిపారు.
ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి సిబ్బంది తన కుమారుడికి ఆక్సిజన్ ఇవ్వకుండా చంపేశారని తండ్రి ఆరోపిస్తున్నారు. అయితే, ఎర్రగడ్డ ఆసుపత్రి అధికారులు మాత్రం ఆక్సిజన్ ఇవ్వలేదనే ఆరోపణను అంగీకరించడం లేదు. కరోనా వైరస్ నేరుగా గుండె మీద ప్రభావం చూపిందని, అందుకే రక్షించలేకపోయామని అంటున్నారు.
ఈ నెల 26న తాను ఆసుపత్రి దగ్గరే ఉన్నానని, అర్ధరాత్రి 12.45 నిమిషాలకు తనకు రవికుమార్ వాట్సప్ వీడియో మెసేజ్ పంపాడని వెంకటేశ్వర్లు వివరించారు. ఆస్పత్రిలోనే ఆవరణలోనే పడుకున్నానని... రాత్రి 2 గంటల సమయంలో మెలకువ వచ్చి ఫోన్ చూసుకున్నాను.